Nellore, June 27: జగనన్న ఇళ్లపై అధికార పార్టీ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల నిర్మాణానికి (YSR Housing Scheme) శంఖుస్ధాపన చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే.. మంత్రులు, స్ధానిక ప్రజాప్రతినిధుల ముందే వై.యస్.ఆర్ జగనన్న కాలనీలపై హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరులో శనివారం జరిగిన హౌసింగ్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి (Kovur mla nallapareddy prasanna kumar reddy) మాట్లాడుతూ జగనన్న ఇళ్లలో నిర్మిస్తున్న బెడ్‌రూమ్‌లు కొత్తగా పెళ్లయిన జంటలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
బెడ్ రూమ్‌లు చాలా చిన్నగా ఉన్నాయని, లబ్దిదారులు రాత్రి వేళ బెడ్‌రూమ్‌లో ఏదైనా పనిచేయాలనుకున్నా ఇబ్బందిగా ఉంటుందన్నారు. బెడ్ రూమ్‌లో పెద్ద మంచం వేయాల్సి వచ్చినా కష్టంగా ఉంటుందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రసన్న సూచించారు.
ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్లలో బెడ్‌రూమ్ సైజ్ తక్కువగా ఉండయంతో హాల్లో శోభనం చేసుకుని బెడ్‌రూమ్‌లో పడుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఎందుకంటే బెడ్‌రూమ్‌లో పెద్దమంచం వేయాల్సి వస్తే కష్టంగా ఉందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో కేవలం 6 అంకణాల్లోనే ఇళ్లు నిర్మిస్తున్నారని ప్రసన్న తెలిపారు. కాబట్టిగ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగానే అర్బన్ ప్రాంతాల్లో కూడా 9 అంకణాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ సమావేశానికి మంత్రులు సీహెచ్.రంగనాథరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి, గౌతమ్‌రెడ్డి, అనిల్‌తో పాటు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
జగనన్న ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం గదుల పరిమాణం ఎంతెంత ఉండాలో నిర్ణయించింది. అప్పట్లో దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు మాత్రం గదుల సైజు తక్కువగా ఉందని వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే జగనన్న కాలనీల పేరుతో నిర్మించే ఈ ఇళ్ల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజైన్లను రూపొందించింది.