Vizag, Feb 14: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంగా భార్య, భర్తల మధ్య చేలరేగిన గొడవలు ఆ కుటుంబాన్ని శోకంలో ముంచింది. ముక్కుపచ్చలారని చిన్నారుల మరణానికి ఈ ఘటన దారితీసింది. రోలుగుంట మండలం, జె.నాయుడుపాలెంకు చెందిన గడదాసు నాగరాజుకు, అదే మండలం, వడ్డిప గ్రామానికి చెందిన సాయితో ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. నాగరాజు ఆటో డ్రైవర్‌గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి భాను(4), పృధ్వీరాజ్(2) జన్మించారు. ఆటో డ్రైవర్ కావడంతో అంతంమాత్రంగా వచ్చే ఆదాయంతో నిత్యం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ క్రమంలో భార్యా, భర్తల మధ్య తరచూ వాగ్వివాదం జరుగుతుండేది. ఇటీవల బంగారం కొనే క్రమంలో వీరిరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ వల్ల తన పిల్లలను తీసుకుని భార్య సాయి హడావిడిగా బయటకు వెళ్లిపోయింది. తిరిగి తనే వస్తుందని భావించిన నాగరాజు పట్టించుకోలేదు. అయితే సాయి తన పిల్లలైన భాను, పృధ్వీలను తీసుకుని సమీపంలో ఉండే వివి వద్దకు వెళ్లింది. ముందు పిల్లలను బావిలో పడేసి, తరువాత తనూ దూకేసింది.
ఈ ఘటనలో చిన్నారులు మృతి చెందగా, దూకిన తరువాత భయపడ్డ తల్లి సాయి బావిలో మెట్టుపట్టుకుని వేలాడుతూ (Mother attempt Suicide) ఉండిపోయింది. ఉదయం అటుగా వస్తున్న మనుషుల శబ్ధం విని సాయి గట్టిగా కేకలు వేయడంతో అప్పటికే చనిపోయిన చిన్నారులతో పాటు తల్లిని బయటకు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇక కర్ణాటక రాష్ట్రం బెళగావిలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ, ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా, భర్త, అత్తమామలను అరెస్టు చేసేంతవరకు అంత్యక్రియలు చేయబోమని మహిళ కుటుంబీకులు భీష్మించుకున్నారు. ఆదివారం బెళగావి బిమ్స్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతురాలు క్రిషా కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ఆమె భర్త మనీశ్, అతని కుటుంబమే ఆమెను హత్యచేశారని ఆరోపించారు. వారందరినీ అరెస్ట్ చేసే వరకు మృతదేహాలను తీసుకునేదిలేదంటూ ధర్నా నిర్వహించారు. దీంతో మూడురోజుల నుంచి బిమ్స్ ఆసుపత్రి మార్చురీలోనే తల్లీపిల్లల మృతదేహాలు ఉన్నాయి.
ఈ నెల 11 తేదీన బెళగావి హిండలగా గణపతి ఆలయం చెరువులో క్రిషా కేశ్వానీ (36), పిల్లలు వీరేన్ (07), బావీర్ (04) మృతదేహాలు తేలాయి. ఇది తెలిసిన వెంటనే భర్త మనీష్, కుటుంబసభ్యులు పరారయ్యారు. కాగా, ఆదివారం మనీష్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ క్రిషాకు వేరొకరితో సంబంధం ఉందని, అదే ఆత్మహత్యలకు కారణమని అన్నారు.