Vjy, Sep 22: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో సభలో విజిల్స్ వేశారు.అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nanadamuri Balakrishna) తీరుపై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్‌గా ఉన్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పారు. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి. జన్మనిచ్చిన తండ్రికి, క్లిష్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది. ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చింది.
మీ బావ జైల్లో ... అల్లుడు ఢిల్లీలో ఉన్నారు. ఇదే మీకు సరైన సమయం.పోయి పగ్గాలు తీసుకోండి. నందమూరి వంశాన్ని నిరూపించుకోండి... పార్టీని బ్రతికించుకోండి. పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి. మీకు నేను సలహా మాత్రమే ఇస్తున్నా. పాటిస్తే పాటించు...పాటించకపోతే అథపాతాళానికి పోతావ్.
మీకు మీ నాయకుడు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే కమాన్ చర్చలో పాల్గొనండి. ప్రజలే నిర్ణయిస్తారు...ఎవరు తప్పుచేశారో. ట్రెజరీ బెంచ్ సిద్ధంగా ఉంది చర్చకు రండి. చంద్రబాబును అరెస్ట్ చేశారు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే టీడీపీ నేతలు ఉన్నారు. నేను లేచి నిలబడకపోతే స్పీకర్ మీద దాడి చేసేవారు. పేపర్‌లో వార్తల కోసం టీడీపీ వ్యవహరించినట్లుగా అనిపిస్తోంది. ఈరోజు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే స్పీకర్ కచ్చితంగా చర్యలు తీసుకోవాలి’’ అంటూ మంత్రి పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై (Chandrababu Arrest) సరైన ఫార్మాట్‌లో రాకుండా టీడీపీ నేతలు గందరగోళం సృష్టించారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీడీపీ ఉద్ధేశం చర్చ కాదు.. రచ్చ అని అన్నారు. శాసనసభలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేయాలేనేదే టీడీపీ ఉద్దేశమని మండిపడ్డారు.
మీ వాదనలన మీరు వినిపించండి...మా వాదనలు మేం వినిపిస్తామన్నారు. చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీకి నమ్మకం ఉంటే.. చంద్రబాబు తప్పు చేయలేదని నిజంగా నమ్మితే చర్చలో పాల్గొనాలని.. పారిపోవద్దని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు.ఈరోజైనా (శుక్రవారం) సరైన ఫార్మాట్‌లో చర్చకు రావాలని కోరుతున్నామన్నారు.