Amaravati, Sep 29: ఏపీలో గత 24 గంటల్లో 68,429 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,190 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavirus Report) అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,87351కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 9,836 మంది క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 6,22,136 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో ప్రకాశంలో ఎనిమిది, చిత్తూరులో ఆరుగురు, అనంతపురంలో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు.. నెల్లూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనా బారిన పడి మొత్తం 35 మంది మరణించారు. దీంతో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 5780కి ( Coronaviru Deaths) చేరింది. ఏపీలో ప్రస్తుతం 59,435 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 57,34,752 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కోవిడ్ (Coronavirus) నివారణకు తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర స్దాయిలో కడప జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అనంతపురం జిల్లా ఉంది. గత గురువారం కడప జిల్లా 4వ స్థానంలో నిలిచింది. ఈ మూడు రోజుల్లో పనితీరును మెరుగుపరుచుకొని రెండవ స్థానానికి చేరుకుంది. ప్రభుత్వం ప్రతి సోమవారం, గురువారం కరోనా సేవలకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్షించి, ర్యాంకులు ప్రకటిస్తుంది.
ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 12 వరకూ నమోదైన కేసులతో పోల్చుకుంటే, సెప్టెంబర్ 13 నుంచి 26 వరకూ నమోదైన కేసుల్లో 23.75శాతం తగ్గుదల ఉంది. గతంలో రోజుకు 91 మరణాలుంటే ఇప్పుడా సంఖ్య 50 లోపే.. ప్రస్తుతం పట్టణాల్లో 40 శాతం, గ్రామాల్లో 60 శాతం కేసులు నమోదవుతున్నాయి.అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు.
భౌతిక దూరం పాటించడం, మాస్కు ధారణే నియంత్రణ మార్గమన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మించి వసూలు చేసే ప్రయివేటు ఆస్పత్రుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అధికంగా వసూలు చేస్తున్నాయంటూ పత్రికలు రాస్తున్నాయని, అయితే ఆ ఆస్పత్రుల పేర్లు కూడా రాస్తే బావుంటుందన్నారు. పేర్లు రాయకపోయినా మా దృష్టికి తెచ్చినా విచారణ జరుపుతామన్నారు.