AP Covid Update: ఏపీలో సెకండ్ వేవ్ కల్లోలం, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్నీ బంద్, తాజాగా 11,698 మందికి కోవిడ్ నిర్ధారణ, 37 మంది మృత్యువాత, 24 గంటల్లో 4,421 మంది డిశ్చార్జ్
COVID-19 lockdown in India | (Photo Credits: IANS)

Amaravati, April 24: ఏపీలో గడచిన 24 గంటల్లో 50,972 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,698 మందికి పాజిటివ్ (Andhra Pradesh reports 11,698 fresh Covid cases) అని నిర్ధారణ అయింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 1,641 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు (1,581), చిత్తూరు (1,306), అనంతపురం (1,066) జిల్లాల్లోనూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు.

అదే సమయంలో 4,421 మంది కరోనా నుంచి కోలుకోగా, 37 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,20,926కి పెరిగింది. 9,31,839 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 81,471 మందికి చికిత్స కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,616కి చేరింది.

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ (Second Wave) కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాత్రి పూట కర్ఫ్యూ (Night Curfew) ఈ రోజు నుంచే అమల్లోకి రానుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై కస్టమ్స్ సుంకం రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం, మూడు నెలలపాటు అమల్లో.., ప్రయోజనం పొందే వాటి వివరాలు ఓ సారి తెలుసుకోండి

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. నైట్ కర్ఫ్యూ సమయంలో కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు మూసివేయాలని స్పష్టం చేసింది. అత్యవసర సేవలకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ఆసుపత్రులు, ల్యాబ్ లు, ఔషధ దుకాణాలు, మీడియా, టెలికాం, ఇంటర్నెట్, కేబుల్ సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్ సంస్థల కార్యాలయాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆహార పదార్థాల సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్టు వివరించింది. విమాన, రైలు ప్రయాణాలు, వైద్యులు, సిబ్బంది రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది.

మద్యం దొరక్క శానిటైజర్‌‌తో పార్టీ, వాంతులతో ఏడు మంది మృతి, మహారాష్ట్రలోని యావత్మల్‌‌లో విషాద ఘటన, 30 మిల్లీ లీటర్ల శానిటైజర్‌ 250 మిల్లీలీటర్ల మద్యం ఇచ్చే కిక్కు ఇస్తుందని తప్పుడు సమాచారం

అత్యవసర రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర రవాణాకు ఆంక్షలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, రాత్రి పూట కర్ఫ్యూ సందర్భంగా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.