
Amaravathi, May 7: ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. అయితే నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్ కేసులు సుమారు 5 వేల వరకు తగ్గాయి. కానీ కోవిడ్ మరణాలలో మాత్రం తగ్గుదల అనేది కనిపించకపోవడం గమనార్హం.
కోవిడ్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కర్ఫ్యూ నేపథ్యంలో ఉద్యోగుల వేళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పని గంటలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల పని గంటలు ఉదయం 8 నుంచి ఉదయం 11.30 వరకు ఉండాలని నిర్ణయించారు.
ఇదిలా ఉంటే, ఏపిలో ప్రమాదకరమైన కొత్త వేరియంట్ వైరస్ వ్యాప్తి ఉందనే వార్తలు ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అసలు రాష్ట్రంలో కొత్త వేరియంట్ వైరస్ అనేది లేదని ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేసినా, దిల్లీ ప్రభుత్వం మాత్రం ఇదే కారణంతో తెలుగు రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చే వారిపై ఆంక్షలు విధించింది.
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,00,424 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 17,188 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 12,45,374కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 12,424,79గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 2,260 కోవిడ్ కేసులు నమోదు కాగా.. విశాఖపట్నం నుంచి 1868, తూర్పు గోదావరి నుంచి 1823 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 73 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 8,519కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 12,749 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 10,50,160 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,86,695 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.