AP Covid-19 Update: కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ఆరోగ్యశాఖ, కోవిడ్ బారీన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ఏపీలో తాజాగా 9,747 కేసులు నమోదు
Coronavirus in India | (Photo Credits: PTI)

Amaravati,August 5: ఏపీలో కొత్తగా 9,747 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కరోనా కేసులు (AP Coronavirus Report) 1,76,333కి చేరాయి. తాజాగా 67 మంది మృతితో (AP Coronavirus Deaths) మొత్తం మరణాలు 1,604కి చేరాయి. ఆస్పత్రుల నుంచి 6,953 మంది డిశ్చార్జ్‌ అవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 95,625కి చేరింది. యాక్టివ్‌ కేసులు (Active Cases) 79,104 ఉన్నాయి. మిలియన్‌ జనాభాకు 40,732 పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 వరకు 64,147 మందికి పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 21,75,070కి చేరింది. కరోనావైరస్ జన్యువు వీక్ అవుతోంది, శుభవార్తను చెప్పిన ఇటలీ శాస్త్రవేత్తలు, దేశంలో కొత్తగా 52,509 మందికి కోవిడ్-19, భారత్‌లో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.15,000 ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డబ్బు మొత్తం బంధువులకు ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు అవసరమైన నిధులను ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం జిల్లా కలెక్టర్లకు విడుదల చేయనుంది. అలాగే ప్లాస్మా దాతలకు రూ.5 వేల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Here's AP Covid Report

ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి (YSRCP MLA Balineni Srinivasa Reddy) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండటంతో ఆయన హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకున్నారు. తొలుత నెగెటివ్‌ రాగా, మంగళవారం సాయంత్రం పరీక్షల్లో వైరస్‌ సోకినట్లు తేలింది. వెంటనే ఆయన చికిత్స కోసం అక్కడి అపోలో ఆస్పత్రిలో చేరారు. అలాగే కరోనా బారిన పడిన చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం (Karanam Balaram Krishna Murthy) హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటుండగా, ఆయన కుమారుడు కరణం వెంకటేశ్‌కు (karanam venkatesh) కూడా పాజిటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో (Giddalur MLA Anna Rambabu) పాటు ఆయన భార్యకు కూడా వైరస్‌ ఉన్నట్లు తేలడంతో ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

ప్రకాశం జిల్లాలో తాజాగా 383 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7544 చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 85 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 67 మంది డిశ్చార్జ్ అయ్యారు. 46 మంది హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. జిల్లాలో ప్రస్తుతం 1480 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు 20 వేలు దాటాయి. మంగళవారం కొత్తగా మరో 1016 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 20,695కు చేరింది. వీటిలో 8909 యాక్టివ్‌ కేసులు ఉండగా, 11,568 మంది డిశ్చార్జి అయ్యారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 8 మంది మృతి చెందారు. కరోనా మరణాల సంఖ్య 218కి చేరింది. పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 15 వేలు దాటాయి. నిన్న ఒక్కరోజే 509 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,497కు చేరింది. ఏలూరులో 45 కేసులు మాత్రమే నమోదు అవడం.. స్థానికులకు కొంచెం ఉపశమనాన్ని కలిగించింది. అటు భీమవరంలో 68 కేసులు నమోదు అయ్యాయి.