VJY, Oct 25: ఏపీ ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని ఓ హోటల్‌లో సోమవారం సమావేశమైన వారు పలు అంశాలపై చర్చించారు. మూడు పారిశ్రామిక కారిడార్లలో ప్రతిపాదించిన ఆరు ఇండస్ట్రీయల్ నోడ్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని, రాష్ట్రం కోసం ప్రతిపాదించిన మూడు మల్టీ మోడల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్కుల వేగవంతమైన అభివృద్ధి, ఫోర్ట్ లీడ్ ఎకానమీ అభివృద్ధికి తోడ్పాటు వంటి అంశాలపై చర్చించారు.కేంద్ర ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన పలు అంశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె ముందు ఉంచారు.
ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌రేటింగ్, సిబిల్ స్కోర్‌లను సులభతరం చేయడం, ఆలస్యమైన చెల్లింపుల సమస్య, ఎంఎస్‌ఎంఈ నుంచి తప్పనిసరి సేకరణ వంటి అంశాలను పరిష్కరించాలని సూచించారు. విజయవాడ నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని పునరుద్ధరించి, సర్వీసులు పెంచాలని, ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాలతో కార్గో సౌకర్యాలను అందించాలని ఆమెను కోరారు. విజయవాడ నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా ప్రాంతాలకు ప్రతిపాదిత వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో సోమవారం 11వ స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ అవకాశాలు కలిగిన దేశమేదైనా ఉందంటే అది భారతదేశమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు మాత్రమే కాకుండా కొత్త మెటీరియల్స్, రేర్ మినరల్స్, మెటీరియల్ సైన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో పరిశోధనలకు పూనుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే ఇస్రో చంద్రయాన్–3 ద్వారా దక్షిణ ధృవం మీదకు వెళ్లగలిగామని, 2040 నాటికి మానవ రహిత ప్రయోగానికి పూనుకోవాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.
2035 లోపు ‘భారత స్పేస్ స్టేషన్’ను పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలని ఇస్రోకు ప్రధాని మోదీ సూచించారని తెలిపారు. చంద్రయాన్–3 విజయాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు చంద్రయాన్ నమూనాను బహుమతిగా అందజేశారు. రాష్ట్ర మంత్రి బుగ్గన మాట్లాడుతూ విద్యార్థుల మేధోపరమైన, విద్యాపరమైన అన్వేషణను వారి వృత్తిపరమైన విజయాలను కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులతో జరుపుకోవడానికి ఇది చిరస్మరణీయ వేదిక అని అన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు, విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎస్‌పీ వాసిరెడ్డి, ఇండియన్ చెస్ ప్లేయర్ కోనేరు హంపిలకు గౌరవ డాక్టరేట్‌లను, 1,820 మందికి డిగ్రీలు, మరికొంతమందికి గోల్డ్ మెడల్స్, అవార్డులను అందజేశారు.సమావేశంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వీసీ నాగభూషణ్ పాల్గొన్నారు.