AB Venkateswara Rao Suspended: ఏబీ వెంకటేశ్వరరావు మళ్లీ సస్పెండ్ ఎందుకయ్యారు, దీనిపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏమంటున్నారు, ఆయనపై ఉన్న కేసు ఏంటీ?
IPS officer A.B. Venkateswara Rao (Photo-Video Grab)

Amaravati, June 29: ఏపీలో ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ (AB Venkateswara Rao Suspended) చేసింది. ఆయనపై గతంలో క్రిమినల్‌ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సస్పెన్షన్‌ అనంతరం ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు (senior IPS officer AB Venkateswara Rao) తనపై పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించడం ద్వారా అఖిల భారత సర్వీసు నిబంధనలను మరోసారి ఉల్లంఘించారని ప్రభుత్వం (YS Jagan government) తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

క్రిమినల్‌ కేసు పెండింగులో ఉన్న అధికారి తన హోదాను దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్‌ విధించవచ్చని సర్వీసు నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. ఆ నిబంధనను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఏబీ వెంకటేశ్వరరావును మంగళవారం సస్పెండ్‌ చేసింది. సస్పెన్షన్‌ కాలంలో ముందస్తు అనుమతిలేకుండా విజయవాడను విడిచి వెళ్లకూడదని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ విభాగం అదనపు డీజీగా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశ రక్షణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఆయనపై గతంలో కేసు నమోదైంది.

ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్‌, ప్రింటింగ్, స్టేషనరీ మరియు స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు

కేంద్ర హోంశాఖ ఆమోదించడంతో ఆయన్ను 2020, మార్చి 7న సస్పెండ్‌ చేసింది. దీనిపై దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆయన సస్పెన్షన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 7తో ముగిసినట్లు చెప్పింది. కానీ, గతంలో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసుల విషయంలో దర్యాప్తును కొనసాగించవచ్చని, అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. తదనంతర పరిణామాలతో ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా నియమించింది.

అతనిపై ఉన్న క్రిమినెల్ కేసు ఏంటీ

నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాల కొనుగోలు, అందుకోసం తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టం అనే కంపెనీకి అడ్డగోలుగా లబ్ధి కలిగించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు పెండింగులో ఉంది. ఆ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు వీలుగా టెండరు నిబంధనలు, సాంకేతిక అర్హతలను కూడా మార్చారు. ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టం కంపెనీకి ప్రయోజనం కల్పిస్తూ 2018, అక్టోబరు 31న రూ.35లక్షలు చెల్లించారు. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్‌టీ ఇన్‌ఫ్లాటబుల్‌ ఆబ్జెక్ట్స్‌ లిమిటెడ్‌/ ఆర్‌టీ ఎల్‌టీఏ సిస్టమ్స్‌ ఉత్పత్తులను భారత్‌లో మార్కెట్‌ సృష్టించేందుకు యత్నించారు.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్సన్ ఎత్తివేసిన ఏపీ హైకోర్టు, వెంటనే ఆయన్ని విధుల్లోకి తీసుకోండి, సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించండి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ

అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ టెక్నికల్, కొనుగోలు కమిటీలను ప్రభావితం చేశారు. ఆ విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా కుట్రపూరితంగా వ్యవహరించిన ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదైంది.తాజాగా ఆయన తనపై నమోదైన క్రిమినల్‌ కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. అందుకే సస్పెండ్ చేశామని తెలిపింది.

ఏబీ వెంకటేశ్వరరావు స్పందన

మరోసారి సస్పెండ్ అయిన ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎంతో మంది ఐపీఎస్ అధికారులు ఉండగా మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి ఘటనతో రాష్ట్రాన్ని తగులబెట్టాలనుకున్నారని... అయితే అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న తాను ఆ ఘటనలు జరగకుండా అడ్డుకున్నానని... అందువల్లే తనను టార్గెట్ చేశారని చెప్పారు.

ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అర్ధరాత్రి తనకు ఫోన్ చేసి... నీ సంగతి చూస్తామని బెదిరించాడని.. అర్ధరాత్రి సమయం కదా, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో అని తాను పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కానీ, ఆ ప్రజాప్రతినిధే నిన్న భోరున ఏడ్చాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయని ఎద్దేవా చేశారు. రిటైర్ అయ్యేంత వరకు ఖాకీ యూనిఫామ్ వేసుకోకుండా చేస్తామని మరో ప్రజాప్రతినిధి గతంలో తనను బెదిరించారని ఏబీవీ అన్నారు. ప్రస్తుతం తాను చేయగలిగింది న్యాయ పోరాటం లేదా ధర్మ పోరాటం మాత్రమేనని చెప్పారు. ఐపీఎస్ అధికారిగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి తాను వ్యవసాయం చేస్తూనే ఉన్నానని... పంటకు పట్టిన చీడపురుగులను ఏరివేస్తూనే ఉన్నానని చెప్పారు.