Amaravati, May 22: ఏపీ ప్రభుత్వానికి (AP Govt) ఇవాళ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావుపై (AB Venkateswara Rao) ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు (AP high court) ఎత్తివేసింది. క్యాట్ ఆర్డర్‌ను కూడా న్యాయస్థానం పక్కనపెట్టింది. వెంకటేశ్వరరావు రిట్ పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. అలాగే సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటుగా వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పుడు హైకోర్టు తాజా ఆదేశాలపై ప్రభుత్వం ఏరకంగా ముందుకెళుతుందనేది అటు రాజకీయంగానే కాకుండా అధికార వర్గాల్లోను ఆసక్తికరంగా మారింది. హైకోర్టులో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు వ్యతిరేక తీర్పులపైన ముఖ్యమంత్రి జగన్ ఏవిధంగా ముందుకెళతారనే చర్చ సాగుతోంది. ఇక ప్రత్యేకించి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 8న వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది. ఆయన నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవటంపై ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే భద్రతా పరికరాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ప్రజాప్రయోజనాల రీత్యా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. సస్పెన్షన్‌పై ఆయన క్యాట్‌ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. టీడీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు విజయవాడ కమిషనర్‌గా ఇంటెలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.