Andhra Pradesh Senior IPS officer A.B.Venkateshwara Rao suspended in A.P (Photo-Twitter)

New Delhi, Mar 08: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు (AP former intelligence chief AB Venkateswara Rao) కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్‌ని ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ (Home Ministry) ఆదేశాలిచ్చింది. ఏప్రిల్ 7 లోపు ఏబీ వెంకటేశ్వర రావు పై (AB Venkateswara Rao) నమోదు చేసిన అభియోగాలపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి (AP Goverment) కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

వేటు పడింది, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్‌

ఇంటెలిజెన్స్‌ మాజీ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను (AB Venkateshwar Rao`s Suspension case) ఖరారు చేస్తూ తదుపరి విచారణను చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏబీపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తును చేపట్టేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. ఈ మేరకు శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నిగమ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు.

పోలీసు విభాగం ఆధునికీకరణ నిధులు దుర్వినియోగం, ఏరోసాట్, యూఏవీల కోనుగోళ్ల కోసం వెంకటేశ్వరావు వెచ్చించిన రూ.25.5 కోట్ల వ్యవహారంలో భారీ అక్రమాలు, అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు కేంద్ర హోంశాఖ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుపై వచ్చే నెల 7వ తేదీలోగా చార్జిషీటు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

ఇదిలా ఉంటే రాజకీయ పగల దృష్ట్యా తనను అకారణంగా సస్పెండ్ చేసిన వైఎస్ జగన్ సర్కార్ (Andhra Pradesh govt).. తనకు వేతనాలు ఇవ్వకుండా తనపై కక్షసాధిస్తోందని ఏబీ వెంకటేశ్వర రావు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినట్లు గా చెబుతున్న లేఖ పాలనా ప్రక్రియలో భాగం మాత్రమేనని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఓ లేఖ రాశారు. ఈ ఆదేశాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తన మీద మోపిన ఆరోపణలు నిజమని కేంద్రం నమ్ముతున్నట్లు కాదని అన్నారు.

విచారణ జరక్కుండా నిజానిజాలు తేలవని, విచారణలో భాగంగా కేంద్రం ఈ ఆదేశాలను జారీ చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై ఛార్జిషీట్‌ను నమోదు చేయడానికి ఏప్రిల్ 7వ తేదీ వరకు గడువు ఇవ్వడం దీనికి నిదర్శనమి అన్నారు. తన మీద, తన వ్యక్తిత్వం మీద చోటు చేసుకుంటున్న దుష్ప్రచారానికి ఎప్పుడు ఎలా ముగింపు పలకాలో తనకు తెలుసునని, సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తానని అన్నారు.

అఖిల భారత సర్వీసు అధికారులను ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినప్పుడు కేంద్రానికి నివేదించడం తప్పనిసరి అవుతుందని, ఆ నివేదిక ఆధారంగా కేంద్రం ఆ సస్పెన్షన్‌ను ఆమోదించవచ్చు లేదా ఆమోదించకపోవచ్చని చెప్పారు. కేంద్రం ఆమోదించకపోతే సస్పెన్షన్ రద్దు కాదని, అయినప్పటికీ.. సస్పెండ్ చేసిన 30 రోజుల్లోగా క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఛార్జిషీట్‌ను అందజేయలేకపోతే సస్పెన్షన్ రద్దవుతుందని వివరించారు.