YSRCP Plenary 2022: వైఎస్సార్‌సీపీ ప్లీనరీ 2022కు సర్వం సిద్దం, జూలై 8 నుంచి రెండు రోజుల పాటు సమావేశాలు, వైఎస్సార్‌సీపీ ప్లీనరీ పార్టీకి పండుగతో సమానమని తెలిపిన విజయసాయిరెడ్డి
YSRCP Plenary (Photo-Twitter)

Amaravati, July 6: ఈనెల 8, 9వ తేదీలలో రెండు రోజులపాటు జరుగనున్న ప్లీనరీ సమావేశాలకు (YSRCP Plenary 2022) సర్వం సిద్ధమైంది. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ పార్టీకి పండుగతో సమానమని, ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా, సమన్వయంతో పని చేయాలని శ్రేణులకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి సూచించారు.కార్యకర్తల ఉత్సాహానికి అనుగుణంగా వ్యవహరించాలని నేతలను కోరారు.

మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, బీసీ, జనరల్‌ కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్ల సమావేశంలో ప్లీనరీకి సంబంధించిన అంశాలపై ఆయన సమీక్షించారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాలకు సంతృప్త స్థాయిలో సీఎం జగన్‌ మేలు చేస్తున్నారని సాయిరెడ్డి తెలిపారు. మహిళలకు అన్ని రంగాలలో సమాన వాటా కల్పిస్తున్నామని చెప్పారు. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో మంత్రివర్గంలో 70 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్‌దేనని గుర్తు చేశారు.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు, మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని తెలిపిన వాతావరణ శాఖ

వైఎస్సార్‌సీపీని (YSRCP) ప్రజలు తమ హృదయాలలో చిరస్థాయిగా పదిలపరుచుకున్నారని ప్లీనరీ (YSRCP plenary) ప్రజా ప్రతినిధుల సమన్వయ కమిటీ కన్వీనర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అందుకే సాధారణ ఎన్నికలలో కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ ఇచ్చారన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికలలో సైతం 80 శాతం మంది ప్రజాప్రతినిధులు పార్టీ నుంచే ఎన్నికయ్యారని గుర్తు చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలా జరగలేదన్నారు. ప్రజలు ఇంతగా ఆదరాభిమానాలు చూపుతున్న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలను అంచనాలకు మించి విజయవంతం చేయాలని సూచించారు. ప్లీనరీకి సంబంధించిన పలు అంశాలను ఆయన పూర్తిస్థాయిలో సమీక్షించారు.

ప్లీనరీ సమావేశాలను (YSRCP Plenary in Guntur) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ కన్వీనర్‌ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలన పట్ల ప్రజలు ఎంతో భరోసాగా ఉన్నారని గుర్తు చేస్తూ వారి అంచనాలకు అనుగుణంగా ప్లీనరీ నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న ఈ ప్లీనరీ చరిత్రాత్మకమైందని ప్లీనరీ వాలంటీర్స్‌ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీని కన్నతల్లిగా భావించే ప్రతి ఒక్కరికీ ప్లీనరీ అపురూపమైన పండుగలా నిలుస్తుందన్నారు. గత ప్లీనరీలో పార్టీ అజెండాను వివరించామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నామనేది ఈ ప్లీనరీ ద్వారా వివరిస్తామన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లీనరీ నిర్వహించే ప్రాంతాన్ని పార్టీ నేతలతో కలసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు