Kandukur, Dec 29:టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది దుర్మరణం చెందడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డు మీదకు రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. అంతేకాదు, చంద్రబాబుపై కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇరుకు రోడ్డులో సభ పెట్టారని ఆరోపించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కేఏ పాల్ చెప్పారు. మృతుల పిల్లలకు తమ ఛారిటీ ద్వారా విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ విషాద ఘటన జరిగింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం అని చెప్పుకునే చంద్రబాబుకు రాత్రి పూట, ఇరుకు సందుల్లో సభ నిర్వహించకూడదనే విషయం తెలియదా?. గోదావరి పుష్కరాల్లో కూడా ఇలాగే పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలను బలితీసుకున్నారు.
చంద్రబాబుకు ఇదేమి పబ్లిసిటీ పిచ్చి అని ప్రజలందరూ ఇదేమి కర్మరా బాబు అని బాధపడుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుంటే తమ్ముళ్లు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చి మాట్లాడతానని చంద్రబాబు చెప్పడం వెనుక అర్థం ఏమిటి?. చంద్రబాబు ఎలాగైనా ప్రజల నుండి సానుభూతిని పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కందుకూరు ఘటనపై కేసు నమోదు చేశాము అని తెలిపారు.
మృతులు వీరే!
1. కాకుమాని రాజా (50), కందుకూరు
2. కలవకూరి యానాది (65), కొండముడుసుపాలెం
3. దేవినేని రవీంద్రబాబు (73), ఉలవపాడు, ఆత్మకూరు మండలం
4. యాటగిరి విజయ (35), ఉలవపాడు
5. ఉచ్చులూరి పురుషోత్తం (56), గుడ్లూరు మండలం గుళ్లపాలెం
6. మర్లపాటి చినకొండయ్య (55), అమ్మవారిపాలెం
7. గడ్డం మధుబాబు (45), ఓగూరు, కందూకురు మండలం
8. రాజేశ్వరి (40), కందుకూరు