TDP Janasena First Coordination Meeting: టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం హైలెట్స్ ఇవిగో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా
TDP Janasena First Coordination meeting (Photo-Video Grab)

Rajahmundry, Oct 23: టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం (TDP Janasena Alliance First Meeting) రాజమహేంద్రవరంలో జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఇరు పార్టీల నుంచి 14 మంది నేతలు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, కలిసి ముందుకు సాగే అంశాలపై చర్చించారు.

లోకేశ్‌తో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయడు. పితాని సత్యనారాయణ హాజరయ్యారు. ఇక పవన్ కళ్యాణ్‌తో పాటు సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన సభ్యులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని, మహేంద్ర రెడ్డిలు పాల్గొన్నారు.

అమిత్‌షాను పదేపదే అపాయింట్‌మెంట్‌ అడిగింది లోకేషే, సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ ముగిసిన అనంతరం లోకేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ..వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైసీపీ నేతలు అన్ని పార్టీల నాయకుల్నీ ఇబ్బంది పెడుతున్నారన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోనని గతంలోనే చెప్పానని, రాష్ట్ర అభివృద్ధే జనసేన పార్టీకి ముఖ్యమని పవన్‌ తెలిపారు.

అనుభవం ఉన్న నాయకుడు ఉండాలనే 2014లో టీడీపీకు మద్దతిచ్చాం. మద్యనిషేధం చేస్తామని చెప్పి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఈ రాష్ట్రానికి వైసీపీ అనే తెగులు పట్టుకుంది. ఆ తెగులు పోవాలంటే.. టీడీపీ- జనసేన వ్యాక్సిన్‌ అవసరం. చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారు. సాంకేతిక అంశాల పేరుతో బెయిల్‌ రాకుండా చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యాం. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే మేం కలిశాం. ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించాం. తెదేపా-జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం. త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తాం’’ అని పవన్‌ అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక.. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఉద్యోగుల డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం.. 2022 జులై 1వ తేదీ నుంచి అమలు

కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా రూపొందించారు. ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, జాబితాలో అవకతవకలపై సమన్వయ కమిటీ ఏర్పాటు సహా.. రాష్ట్ర స్థాయి నుంచి బూత్, జిల్లా స్థాయిల వరకు సమన్వయంపై ఐకాస కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, అవినీతిపై, ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాట ప్రణాళికపై సమన్వయ కమిటీ చర్చించింది. ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాట ప్రణాళికపై సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీన ఓటర్ తొలి ముసాయిదా ప్రకటనపై చర్చించారు.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సమన్వయ కమిటీ తీర్మానం చేసింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. సమన్వయ కమిటీ తదుపరి భేటీలు ఉత్తరాంధ్ర, రాయలసీమలో జరపాలని నిర్ణయించారు. సమన్వయ కమిటీ భేటీకి ముందు నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు విడిగా సమావేశమయ్యారు.

భేటీకి ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం జైలులో లోకేశ్‌ కలిసి మాట్లాడారు. ప్రధానంగా జనసేనతో నిర్వహించనున్న సమన్వయ కమిటీ సమావేశం.. అందులో ఏయే అంశాలను చర్చిస్తున్నామనే విషయాలను లోకేశ్.. చంద్రబాబుకు తెలిపారు. కరవు, కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్షతో పాటు వివిధ ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు లోకేశ్‌ పేర్కొన్నారు. నిత్యావసర ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపు వంటి అంశాలపైనా దృష్టి సారించాలని లోకేశ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయి వరకు టీడీపీ-జనసేన కమిటీల ఏర్పాటుపైనా చర్చించారు.