Vizianagaram, Oct 30: ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలోవిశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది.ఆపై పక్క ట్రాక్‌లోని గూడ్సుపైకీ దూసుకెళ్లి మరింత బీభత్సం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 54 మందికి గాయాల అయ్యాయని అధికారులు ప్రకటించారు.
ప్రమాద తీవ్రతకు పట్టాలు సైతం పైకి లేచాయి. ప్రమాదం జరిగినప్పుడు రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్, గూడ్సు రైళ్లలో కలిపి ఏడు బోగీలు నుజ్జయ్యాయి. ట్యాంకర్ గూడ్సుపైకి పలాస రైలుకు చెందిన రెండు బోగీలు దూసుకెళ్లడంతో పట్టాలు పైకి లేచి, దానికింద తలకిందులుగా రైలు దూసుకెళ్లిన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది.
వెనుక నుంచి ఢీకొట్టిన రాయగడ రైలు ఇంజినుపైకి ఆ రైలు బోగీలే మూడు పైకెక్కి, పక్కనే ఉన్న బొగ్గు రవాణా గూడ్సు రైలును ఢీకొన్నాయి. విశాఖ-రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. దాని వెనుక ఉన్న డీ-1 బోగి వేగానికి కొంత భాగం విరిగి పైకి లేచింది. రాత్రి సమయం కావడంతో ఘటనా స్థలంలో సహాయక చర్యలు అందించడం సవాలుగా మారింది.
కాగా ఈ ప్రమాదానికి మానవతప్పిదమే కారణమని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి తెలిపారు. ప్రమాదంపై ఓ మీడియా ఛానెల్‌తో ఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ విశ్వజిత్ సాహూ మాట్లాడుతూ..రాయగడ ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వల్లే ప్రమాదం జరిగింది. రెడ్ సిగ్నల్‌ను రాయగడ లోకో పైలట్ పట్టించుకోలేదు. ఫలితంగానే ఘోర ప్రమాదం సంభవించిందని అధికారి సాహూ తెలిపారు. అయితే దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. కాగా ఈ ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్ రావు కూడా మృతి చెందారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే.. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు విశాఖపట్నం-పలాస (08532) రైలు బయలుదేరింది. వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ప్రారంభమైంది. కంటకాపల్లి-అలమండ మధ్య నెమ్మదిగా వెళ్తున్న పలాస రైలును రాయగడ రైలు ఢీ కొట్టిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ విశ్వజిత్ సాహూ తెలిపారు.
ఆరు మృతదేహాలు విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో.. మరో మృతదేహం మిమ్స్ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. మిగతా 7 మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించనున్నట్లు సమాచారం. మృతి చెందినవారిలో ఇప్పటి వరకు 9 మంది వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది.
ఇప్పటి వరకు గుర్తించిన మృతుల వివరాలు
1. గిరిజాల లక్ష్మి (35), కంచు భారతి రవి (30), చల్లా సతీశ్ (32), ఎస్.హెచ్.ఎస్.రావు, కరణం అక్కలనాయుడు, ఎం. శ్రీనివాస్, విశాఖ-పలాస పాసింజర్ రైలు గార్డు, రెడ్డి సీతమనాయుడు (43), మజ్జ రాము (30)గా గుర్తించారు.
Here's Drone Visuals
#WATCH | Drone visuals of the train collision in Vizianagaram, Andhra Pradesh. Rescue operations underway pic.twitter.com/ou24l03HP1
— ANI (@ANI) October 30, 2023
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఘటనాస్థలికి సీఎం జగన్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన అక్కడికి చేరుకోనున్నారు. విమానంలో తాడేపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లనున్న జగన్.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అలమండ వెళ్తారు. ఆ తర్వాత అలమండ నుంచి ప్రత్యేక రైలులో వెళ్లి ప్రమాదస్థలిని పరిశీలించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును సీఎం అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో దానికి తగిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.