పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ వాలంటీర్ల భగ్గుమంటున్నారు. పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ మేరకు ఏలూరులో వాలంటీర్లు. పవన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న వాలంటీర్ల సేవలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ వ్యవస్థను నిర్వీర్వం చేయాలని చూస్తున్నారని ఆగ్రహిస్తూ.. తక్షణమే తమకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వాలంటీర్లపై పవన్ విషం, సీరియస్ అయిన ఏపీ మహిళా కమిషన్, సమన్లు జారీ
ముత్యాలంపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వాలంటీర్లు నిరసన చేపట్టారు. వాలంటీర్లు దేశ విద్రోహ శక్తులుగా వ్యాఖ్యలు చేసిన పవన్.. ఆ వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. మహిళల పట్ల మీకు ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అర్థమవుతుందని, మీరు చెప్పిన డేటా ఎవరికి అందిందో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. బహిరంగంగా మాట్లాడిన మాటలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని లేకుంటే యావత్ మహిళా లోకం సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజానీకం వాలంటీర్ వ్యవస్థను కొనియాడుతోందని తెలిపారు. కరోనా సమయంలో పవన్ ఫాంహౌజ్‌లోనే పడుకున్నాడని, వాలంటీర్ల మాదిరి ప్రజలకు సేవ చేయలేదని విమర్శించాడు. వాలంటీర్లలో ఎక్కువశాతం మహిళలే ఉన్నారని, మహిళలంటే పవన్‌కు గౌరవం లేదని మండిపడ్డారు. పవన్‌కు సిగ్గు,శరం లేదని.. వాలంటీర్లకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్‌కు కమిషన్ సమన్లు జారీ చేయనుంది. మహిళలను ఉద్ధేశించి చేసిన పవన్ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈమెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు.
ఈ క్రమంలో పవన్‌కు నోటీసులు ఇస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. దీనిపై 10 రోజుల్లోపు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని, ఆయనకు ఏ ఇంటెలిజెన్స్ అధికార చెప్పారో సమాధానం చెప్పాలని అన్నారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్ తప్పించుకోలేరని విమర్శించారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. పవన్ చెప్తున్న 30 వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని దుయ్యబట్టారు.
మరోవైపు పవన్ అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. తమకు తక్షణమే పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.