MLC Anantha Babu: పోలీసులు ఎదుట లొంగిపోయిన ఎమ్మెల్సీ అనంతబాబు, డ్రైవర్‌ హత్య కేసు విచారణ జరుగుతోందని తెలిపిన ఏఎస్పీ శ్రీనివాస్‌
MLC-Ananta-Babu

Kakinada, May 23: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి (MLC Anantha Babu Arrest) తీసుకున్నారు. డ్రైవర్‌ హత్య కేసు విచారణ జరుగుతోందని ఏఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. అనంతబాబు పోలీస్‌ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ఈ రోజు అనంతబాబును (YCP MLC Anantha Babu) అరెస్ట్‌ చేస్తామని ఏఎస్పీ వెల్లడించారు. ఘటన జరిగిన రోజు ఎక్కడున్నారనే దానిపై గన్‌మెన్లకు సంజాయిషీ నోటీసులను పోలీసులు జారీ చేశారు.

కాగా ఏపీలో సుబ్రహ్మణ్యం మృతిపై ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలని దళిత, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అనంతబాబు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరోవైపు సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ హత్య కేసులో భాగంగా అతని స్నేహితులను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం, ఘటనపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన కాకినాడ ఎఎస్పీ శ్రీనివాస్

హత్య జరిగిన రోజు వారిద్దరు డ్రైవర్ సుబ్రహ్మణ్యంతోనే ఉన్నారు. ఈ విషయంలో స్నేహితుల తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. వారిద్దరూ తమ వద్దనే ఉన్నారని పోలీసులు సర్ది చెప్పి పంపించారు.

ఇక డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా భావిస్తున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్పు చేస్తున్నామని, అనంతబాబును వెంటనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. విచారణ తర్వాత అరెస్టు చేయాల్సి వస్తే చేస్తామని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు సహకరించక పోవడం వల్లే పూర్తి వివరాలు సేకరించడం ఆలస్యమైందని చెప్పారు.

ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర సుబ్రహ్మణ్యం ఐదారు సంవత్సరాలుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 3 నెలల క్రితం అతన్ని విధుల నుంచి తొలగించారు. సుబ్రహ్మణ్యం 20వ తేదీన అనుమానాస్పదంగా చనిపోయినట్లు అతని తల్లి రత్నం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు.