Nirmala Sitharaman (Photo-ANI)

Amaravati, Feb 1: కేంద్ర బడ్జెట్ 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వం ఏపీపై ఏం కరుణ చూపుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన గాయాలతోపాటు కరోనా సంక్షోభం రాష్ట్రాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌పై (Union Budget 2023) ఏపీ ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన రెవిన్యూ లోటు ఇంకా అలానే ఉంది. మరో వైపు కోవిడ్‌తో రాష్ట్రం (Andhra Pradesh) భారీగా ఆదాయం కోల్పోయింది.

ఈ నేపథ్యంలోనైనా బుధవారం కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో (Union Budget 2023-24) రాష్ట్రానికి నిధుల కేటాయింపులో తగు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ సంస్థలకు జాతీయ గ్రాంట్ల రూపంలో ఈసారైనా బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఆశిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన 2014–15 ఆర్థిక ఏడాదిలో ఏర్పడ్డ రెవెన్యూ లోటు భర్తీకి ఈసారి బడ్జెట్‌లోనైనా పూర్తి స్థాయిలో కేంద్రం నిధులు కేటాయించాలని కోరుతోంది.విభజన అనంతర లోటు పూడ్చేందుకు తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

చివరి బడ్జెట్‌ పై ఈ వర్గాల్లో ఉత్కంఠ, ఇంతకీ బడ్జెట్‌కు ముందు ఏం చేస్తారో తెలుసా? ఈ సారి బడ్జెట్‌లో ఈ రంగాలకు ఊరట లభించే ఛాన్స్

ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్‌లో రూ.24,350 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. అలాగే విశాఖకు మెట్రో రైలు మంజూరు చేయడంతోపాటు తగినన్ని నిధులు ఇవ్వాలని విన్నవించింది. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కూడా సమర్పించింది.

ఈ నేపథ్యంలో ఈ బడ్టెట్‌లో మెట్రో రైలు ప్రకటనతో పాటు కేంద్రం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసినందున జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మిగిలిన 12 జిల్లాలకు వైద్య కళాశాలలకు నిధులు కేటాయించాలని కోరుతోంది. అలాగే రాజధాని వికేంద్రీకరణతో ఆ కార్యకలాపాలకు కూడా నిధులను ఆశిస్తోంది.

రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్, ఇక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదమే తరువాయి, బడ్జెట్‌లోని అంశాలపై రాష్ట్రపతికి వివరించిన నిర్మలా సీతారామన్

ఇక పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్‌ నిధులను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరుతోంది. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద పదేళ్ల పాటు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, ఆదాయపన్ను మినహాయింపు, 100 శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియం రీయింబర్స్‌మెంట్‌లను కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ఇక అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో, అభివృద్ధి వికేంద్రీకరణకు కూడా నిధులను కేంద్రం నుంచి కోరుతోంది.

ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్న సమయంలో కూడా రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి ఏపీ రెవిన్యూ లోటు భర్తీకి నిధులను మంజూరు చేయాలని కోరినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈసారి ఈ బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపు పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు ఏపీ ప్రజలు.మరి ఈరోజు నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ ఆశలు నెరవేరుతాయా.. ఈసారైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం కరుణిస్తుందా? అన్నది చూడాలి.