Kadapa, Feb 23: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case:) పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మెజిస్ట్రేట్ బదిలీ చేశారు. దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే (YS Viveka murder case transferred) వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. రిమాండ్, వాయిదా, బెయిల్ అంశాలు కడప కోర్టులోనేనని మెజిస్ట్రేట్ ఆదేశించారు. మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ నలుగురికి సీబీఐ అభియోగ పత్రాల వివరాలు అందించారు. ఇకపై ఈ కేసుకు సంబంధించిన విచారణ మొత్తం కడప కోర్టు (Pulivendula to Kadapa district court )లోనే జరగనుంది.
అంతకుముందు ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడువును న్యాయస్థానం 14 రోజుల పాటు పొడిగించింది. కడప జైలులోని సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలను కొంత ఆలస్యంగా కోర్టుకు తీసుకువచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఇక వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడైన డ్రైవర్ దస్తగరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను అప్రూవర్‌గా మారేందుకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ క్రమంలో పులివెందుల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉంచిన అధికారులు.. గంటపాటు దస్తగిరిపై విచారణ జరిపారు. ఈ సమయంలో బాధలు తట్టుకోలేకపోవడంతోనే తాను అప్రూవర్‌గా మారినట్లు దస్తగిరి తెలిపాడు. తన భార్యాబిడ్డలు అనాథలవుతారనే భయంతోనే సీబీఐకి జరిగిన విషయం చెప్పానని చెప్పాడు. కుటుంబం కోసమే తాను అప్రూవర్‌గా మారినట్లు వెల్లడించాడు.
దీంతో అతని నుంచి సెక్షన్ 164 వాంగ్మూలం తీసుకోవడానికి సీబీఐ సన్నద్ధమైంది. అతను అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు గత నవంబరు 26నే అనుమతించింది. కానీ దీనిపై కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి కేసును హైకోర్టు కొట్టిపారేసింది. కింద కోర్టు తీర్పును సమర్దిస్తూ నిందితులు వేసిన పిటిషన్లను కొట్టివేయడంతో దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి లైన్ క్లియర్ అయింది. దీంతో సీబీఐ అధికారులు దస్తగిరితో రెండవసారి 164 వాంగ్మూలం ఇప్పించేందుకు పులివెందుల కోర్టు అనుమతిని తీసుకున్నారు.