AP High Court

Vjy, Oct 12: అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేస్తూ శుక్రవారం వెల్లడిస్తామని తెలిపింది.

‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరిట ఆగస్టు 4న అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళుతున్నప్పుడు ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘటనలో చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు.

అందులో చంద్రబాబును ఏ-1గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం కొందరికి బెయిల్‌ లభించింది. ఆ తర్వాత మరికొంతమందికి బెయిల్‌ మంజూరైంది. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సెప్టెంబరు 26న ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.

చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు, బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా వేసిన ధర్మాసనం

చంద్రబాబుపై అధికార పార్టీ నేతలే దాడి చేసి వాళ్లే కేసు పెట్టారని న్యాయవాది వాదించారు. రాళ్లు రువ్విన ఘటనలో చంద్రబాబును ఎన్‌ఎస్‌జీ కమాండర్లు కాపాడారని కోర్టుకు తెలిపారు. బాధితుల మీదే పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందికి ముందస్తు బెయిల్‌ కూడా మంజూరు చేశారని.. అందువల్ల చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఇక స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్‌ చేసింది. స్కిల్‌ కేసులో లోకేష్‌ను ముద్దాయిగా చూపలేదని.. అందువల్ల ఆయనను అరెస్టు చేయబోమని కోర్టుకు సీఐడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఒకవేళ కేసులో లోకేశ్‌ పేరును చేర్చితే 41ఏ నిబంధనలు అనుసరిస్తామన్నారు. దీంతో లోకేశ్‌ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది.

చంద్రబాబుకు కాస్త ఊరట, సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని కోర్టు ఆదేశాలు, రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు

లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈ నెల 4నే విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 12 వరకు లోకేశ్‌ను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించిన న్యాయస్థానం.. ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌లో చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారని లోకేశ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ నేపథ్యంలోనే పిటిషనర్‌ను అరెస్టు చేసేందుకు అవకాశం ఉన్నందునే ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. లోకేశ్‌ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.