Amaravati, Mar 17: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదాపడ్డాయి. అలాగే ఏపీ శాసన మండలి గురువారం వాయిదా పడింది. తిరిగి శాసన మండలి సోమవారం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీలో (AP Budget Session 2022) పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మాట్లాడుతూ.. ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు 30.76 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తొలి విడతలో 15.60 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సొంతిల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల అని సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan) అన్నారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు మహాయజ్ఞం చేశారని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం 71,811 ఎకరాల భూమి సేకరించామని తెలిపారు. రూ.25వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 వేల కాలనీలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఇవాళ ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నామని చెప్పారు. 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశామని గుర్తు చేశారు.
ప్రతి కాలనీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. పేదల ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందజేస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. గతంలో టిడ్కో ఇళ్లపై పేదలు నెలకు రూ.3వేలు కట్టాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ, ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషణ్ కూడా చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే లక్షకుపైగా టిడ్కో ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. మరో 63వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. నిరుపేదలను ఇంటి యజమానులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పేదల కళ్లలో ఆనందం, సంతోషమే తమకు శక్తిని ఇస్తుందని అన్నారు. ప్రతి మహిల చేతికి రూ. 5 లక్షల వరకు ఆస్తిని ఇచ్చామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా సుపరిపాలన సాగిస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఏపీని ప్రగతిపథంలో సీఎం జగన్ నడిపిస్తున్నారని ఆయన అన్నారు. నాటుసారాను ప్రోత్సహించే అవసరం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సభను తప్పుదో పట్టించాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. టీడీపీకి రోజూ ఏదోవిధంగా సభను అడ్డుకోవడం అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా టీడీపీ శవ రాజకీయాలు మానుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు.
ప్రభుత్వంపై కావాలనే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి శంకర్‌నారాయణ ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అమరావతిలో పేరుతో గ్రాఫిక్స్ మాత్రమే చూపించారని.. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదని శంకర్ నారాయణ మండిపడ్డారు. రోడ్లపై గత ప్రభుత్వం కంటే అధికంగా ఖర్చు పెడతున్నామన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.