AP Budget Session 2022: ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్, ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్‌‌కు శాసన సభ ఆమోదం, బడ్జెట్‌పై కొనసాగుతున్న చర్చ
tammineni sitaram in assembly(Photo-Video Grab)

Amaravati, Mar 15; ఆంధ్ర ప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపక్ష తెలుగు దేశం తీరు తీరు మారడం లేదు. పదేపదే సభను (AP Budget Session 2022) అడ్డుకోవడంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ పదకొండు మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ ( Eleven TDP MLAs suspended) చేశారు. శాసనసభ నుంచి టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెన్షన్‌ చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హితవు పలికారు. అయినా వాళ్ల తీరు మార్చుకోక పోవడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

స్పీకర్ పోడియం చుట్టు ముట్టి నిరసన తెలియజేశారు. హుందాగా వ్యవహరించాలని.. ఇటు సీఎం జగన్, అటు స్పీకర్ సైతం కోరినా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు. దీంతో ఏపీ శాసన సభ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్‌ చేశారు స్పీకర్‌ సీతారాం. టీడీపీ సభ్యులు అశోక్ బెందాళం, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, గణబాబు, భోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరు, సాంబశివరావు, సత్యప్రసాద్‌లను సస్పెండ్‌ అయినవాళ్లలో ఉన్నారు. అంతకుముందు సీఎం వైఎస్‌ జగన్ మాట్లాడుతూ.. సభలో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.

జగన్ సింగిల్‌గానే పోరాడతారు, పవన్ కళ్యాణ్ ఓ ఊసరవెల్లి, ఎప్పుడు ఏ గుర్తుకు ఓటేయమంటారో తెలియదని వ్యంగ్యం విసిరిన మంత్రి పేర్ని నాని, జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర విమర్శలు

అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హితవు పలికారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, 55 వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా? నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నమ్మే విధంగా ఉండాలన్నారు.

సారాపై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ మద్యం అడ్డుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ తెచ్చాం. రెండేళ్లలో 13 వేల కేసులను నమోదు చేశాం. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకేనా తెలుసా? టీడీపీ సభ్యులు మెదడుకు పదును పెట్టి ఆలోచించాలి. సాధారణ మరణాలపై తప్పుడు రాజకీయం చేస్తున్నారు. కామన్‌ సెన్స్‌ లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. అబద్ధాన్ని నిజం చేయడానికి గ్లోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. జరగని ఘటన జరిగినట్టుగా విష ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలతో కలిసి చంద్రబాబు విష ప్రచారం చేయిస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఘటనపై ఇప్పటికే వివరంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాం. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని’’ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్‌ ప్రవేశపెట్టారు. వైట్‌,రెడ్‌, గ్రీన్‌ లైన్స్‌ ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వ చీఫ్‌ శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదించారు. శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదించిన మోషన్‌కు సభ ఆమోదం తెలిపింది. ఆ లైన్స్‌ దాటితే ఆటోమాటిక్‌గా సభ్యులు సస్పెన్షన్‌ అవుతారు. ఈ మేరకు రూల్‌ కమిటీకి స్పీకర్‌ తమ్మినేని సీతారాం సిఫార్స్‌ చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇదే ప్రతిపాదనను అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు తెరపైకి తెచ్చారు. సభను హుందాగా నడిపేందుకు ఈ కొత్త రూల్‌ తీసుకువచ్చామని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

బడ్జెట్‌పై ఏపీ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ ఉన్నా.. రాబడి తక్కువ ఉ‍న్నా సంక్షేమం ఆగలేదని తెలిపారు. చంద్రబాబు అమలు చేసిన ఒక్క మంచి పథకం చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. విద్యకు సీఎం వైఎస్‌ జగన్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో విద్య కోసం రూ.29వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని పేర్కొన్నారు. వైఎస్సార్‌ పింఛను కానుక కోసం రూ. 18వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.