Amaravati, Sep 15: ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు (CM Jagan Speech On Three Capitals) చేశారు. టీడీపీ సొంత అభివృద్ధి కోసమే ఈ ఉద్యమాలు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటే కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పది.
అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం కాదు.. కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమే’నని సీఎం జగన్ (CM Jagan on Three Capitals) విమర్శించారు.అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు అని సీఎం జగన్ ప్రశ్నించారు.
1956-2014 వరకు 58 ఏళ్లలో చంద్రబాబు ఏ ఉద్యమం చేయలేదని చెప్పిన సీఎం జగన్... వెయ్యి రోజులుగా కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలని ప్రశ్నించారు. నవరత్నాల ద్వారా రూ.లక్షా 65వేల కోట్లు డీబీటీ ద్వారా లబ్దిదారులకు అందించాం. అవినీతికి తావులేకుండా నేరుగా అకౌంట్లలో వేశాం.
చంద్రబాబు హయాంలో రైతుభరోసా ఎందుకు లేదు?. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వలేదు?. 21 లక్షల ఇళ్లు ఎందుకు నిర్మించలేదు?. బాబు హయాంలోనూ, ఇప్పుడు ఒకే బడ్జెట్ ఉంది.. మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయి?. చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలు ఎందుకివ్వలేదు?. ఆనాడు దోచుకో పంచుకో తినుకో అన్నట్లు సాగింది.
బినామీ భూములు ప్రాంతమే రాజధానిగా ఉండాలనేదే పెత్తందారీల మనస్తత్వం. పచ్చళ్లు అమ్మినా మా వారి పచ్చళ్లే అమ్మాలనేది పెత్తందారీ మనస్తత్వం. చిట్‌ఫండ్ వ్యాపారమైనా మా వాళ్లే వ్యాపారం చేయాలనేది పెత్తందారీల మనస్తత్వం. మా వాడైతే ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించి చిట్‌ఫండ్ వ్యాపారం చేయొచ్చనేది వారి మనస్తత్వం. మా నారాయణ, మా చైతన్య ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. ప్రతిపక్ష పార్టీలో కూడా నా మనుషులే ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. వీళ్లంతా ఈ మధ్య ఒకటే రాజధాని అమరావతి అని డిజైన్ చేశారు.
అమరావతిపై నాకు ఎలాంటి కోపం లేదు.. ఎందుకు కోపం ఉండాలి?. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే నా ఆకాంక్ష. అమరావతి అటు గుంటూరుకు, ఇటు విజయవాడకు దూరంగా ఉంది. ఆ ప్రాంతంలో కనీస వసతి సౌకర్యాలు లేవు. ఎకరాకు రూ.2కోట్ల చొప్పున ఖర్చవుతుందని బాబే చెప్పారు. రాష్ట్రంలో 80శాతం మంది తెల్లరేషన్‌కార్డుపై బతుకుతున్నారు. అమరావతిలో కేవలం 8కి.మీ పరిధిలో 53వేల ఎకరాల్లో కనీస మౌలిక సదుపాయాలకు లక్షా 10వేల కోట్లు అవుతందని చంద్రబాబే చెప్పారు. రాజధాని నిర్మాణానికి 4 నుంచి 5 లక్షల కోట్లు కావాలని చంద్రబాబే అన్నారు.
బాబు హయాంలో ఏడాదికి వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. రాజధాని కోసం అంతకంటే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టలేకపోయారు. రూ.5వేల కోట్లు పెట్టి ఇంకా లక్షా 5వేల కోట్లు ఖర్చు పెట్టాలంటే.. వందేళ్లకు రెండు, మూడింతల రెట్టింపు అవుతంది. అమరావతి రాజధానిని ఎక్కడికీ తరలించడంలేదు. విశాఖ, కర్నూలులో కూడా రాజధానులు పెడతామని చెప్పాం. రాష్ట్రమంటే 3.96 కోట్ల ఎకరాల భూభాగం. 30వేల ఎకరాల రైతులే కాదు మరో 50లక్షల రైతులు కూడా ఉన్నారు. అమరావతిలో రాజధాని తీసేయాలని నేను చెప్పలేదు. విశాఖ, కర్నూలులో కూడా రాజధానులుగా ఉండాలని చెప్పా.
హాట్ హాట్‌గా ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు
వికేంద్రీకరణపై అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. ‘అభివృద్ధి వికేంద్రీకరణ అవమసరమని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. రాజధాని కోసం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే.. చంద్రబాబు నారాయణ కమిటీని నియమించారు. నారాయణ కమిటీ తుళ్లూరులో రాజధాని ఎంపిక చేసింది. దానికి అమరావతి అని పేరు పెట్టారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ చుట్టూ భూములు కొనిపించినట్టే.. తమ వాళ్లతో అమరావతిలోనూ చంద్రబాబు భూములు కొనిపించారు.
రూ. లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి కష్టమనే.. సీఎం జగన్ వికేంద్రీకరణకు మొగ్గు చూపారు.’ అని కన్నాబాబు తెలిపారు. ఏపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ స్వప్రయోజనాల కోసమే రాజధానిగా అమరావతి ఉందన్నారు. విజన్ అని చెప్పుకునే చంద్రబాబు ప్లానింగ్ ఏంటో అర్థం కాలేదన్నారు. పాదయాత్ర పేరుతో హడావుడీ చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వమే కాకుండా నిర్మాత కూడా చంద్రబాబేనని విమర్శించారు.
కుప్పంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు తనకు లేఖ రాశారని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం గాడిదలు కాశారంటూ మండిపడ్డారు. కుప్పం ప్రజల ఒత్తిడి వల్ల రెవెన్యూ డివిజన్ పై తనను అడక్క తప్పలేదని అన్నారు.
75 ఏళ్లలో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తే, తాము 13 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పారు. వికేంద్రీకరణ అంటే ఇదేనని ఉద్ఘాటించారు. అమరావతిలో బినామీల కోసం విశాఖ అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖకు మాత్రమే కాదు, విజయవాడకు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాకే విజయవాడలో అభివృద్ధి జరుగుతోందని, 65 శాతం నిధులు ఖర్చు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మరి ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.
వికేంద్రీకరణపై చంద్రబాబు మాటలు అర్థరహితం అని కొట్టిపారేశారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎన్ని మంచి ఫలితాలు ఉన్నాయో గోదావరి వరదల సమయంలో వెల్లడైందని, అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసి వరదల నుంచి ప్రజలను ఆదుకున్నాయని సీఎం జగన్ వివరించారు. ఏ ఒక్క కుటుంబం కూడా తమకు వరద సాయం అందలేదని చెప్పలేదని వెల్లడించారు.