Amaravati, Mar 14: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
కాగా, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అన్నారు.
తొలిసారి ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్ అన్నారు.