Amaravati, July 21: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు అయింది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Expansion) జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS jagan) నిర్ణయించారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గం లో అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం వైయస్ జగన్, కోవిడ్ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10కి పెంపు, ఏపీలో తాజాగా 4,074 పాజిటివ్ కేసులు నమోదు
తూర్పు గోదావరి జిల్లాకు శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు (Chellaboina Venugopal) పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్య కార కుంటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు (Sidiri Appalaraju) మోపిదేవి స్థానంలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
మంత్రి వర్గ సభ్యుల పేర్లను నేడు అధికారికంగా ప్రభుత్వం వెల్లడించనుంది. కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం జగన్ రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. రాజ్యసభకు ఎన్నికైనందున సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను నిన్న గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదించిన సంగతి తెలిసిందే. వారు రాజీనామాలు చేసిన స్థానాల్లో కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్ల సిఫారసు
గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్ పేర్లను ఖరారు చేయగా.. అవే పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సమర్పించింది. పండుల రవీంద్రబాబు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా, జకియా ఖానమ్ ముస్లిం మైనారిటీ మహిళా నేత కావడం విశేషం.