Vjy, Sep 20: సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు. సీఎం జగన్ అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి రూ.50వేలు, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు.దీనిలో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, కురుపాం ఇంజినీరింగ్ కళాశాలలో గిరిజనులకు 50 శాతం సీట్లిచ్చే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది.ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ బిల్లు అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్తలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి..ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యేలా చూడాలని భేటీలో సీఎం జగన్ కోరారు. మొత్తం 49 అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.