Amaravati, July 22: ప్రకాశం జిల్లా చీరాల ఎస్సై విజయకుమార్ దాడి చేసిన ఘటనలో (Chirala SI Assaulting Incident) కిరణ్ అనే దళిత యువకుడు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈనెల 18న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కిరణ్ కుమార్ అనే యువకుడిని ఎస్సై విజయ్ కుమార్ (SI vijaykumar) చితకబాదారు. సదరు యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు గుంటూరు తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ (Kiran Kumar) మృతి చెందాడు. శిరోముండనం చేసిన ఎస్ఐ అరెస్ట్, దళిత యువకుడిపై అమానుష దాడి, ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాలని జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO Office) ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) మరణించిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.
ఇదిలా ఉంటే చీరాల ఘటనపై పోలీసులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ (SP Koushal) పేర్కొన్నారు. ఘటన జరిగిన సమయంలో బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నారన్నారు. తనిఖీల్లో భాగంగా ప్రశ్నించిన పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని ఎస్పీ తెలిపారు. సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్సై విజయ్ కుమార్ వారిని పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా పోలీస్ వాహనం నుంచి కిరణ్ బయటకు దూకాడని వెల్లడించారు.
ఒక్కసారిగా వాహనం నుంచి దూకటంతో కిరణ్ తలకు గాయాలయ్యాయన్నారు. వైద్య చికిత్సల కోసం గుంటూరుకు తరలించగా చికిత్స పొందుతూ కిరణ్ మృతి చెందాడన్నారు. కిరణ్ తండ్రి ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఎస్సై విజయ్ కుమార్‌పై కేసు నమోదు చేశామన్నారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షులు కూడా ఉన్నారన్నారు. ఘటనకు సంబంధించి కందుకూరు డీఎస్పీని విచారణ అధికారిగా నియమించామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు.