Dalit Youth Tonsured Case: శిరోముండనం చేసిన ఎస్ఐ అరెస్ట్, దళిత యువకుడిపై అమానుష దాడి, ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
Dalit Youth Tonsured Case (Photo-Twitter)

Amaravati, July 22: తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడిపై అమానుషంగా దాడి చేయడమే కాకుండా స్టేషన్‌లో శిరోముండనం చేసిన కేసులో (Dalit Youth Tonsured Case) ట్రైనీ ఎస్సై ఫిరోజ్‌షాను పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపైనా సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీతానగరం మండలంలోని మునికూడలికి చెందిన ఎస్సీ యువకుడు (Dalit Youth) ఇండుగుబిల్లి ప్రసాద్‌కు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై ఫిరోజ్‌ సమక్షంలోనే తీవ్రంగా కొట్టి, ట్రిమ్మర్‌తో శిరోముండనం చేసిన ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేగిన విషయం విదితమే. అసలేం జరిగింది? దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లో శిరోముండనం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం, ఎస్సై,ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్

ఈ కేసును ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు (AP Police ) సీరియస్ గా తీసుకున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు డీఎస్పీ సత్యనారాయణరావు, సీఐ పవన్‌కుమార్‌ రెడ్డి, ఎస్సై యామన సుధాకర్‌ మునికూడలి వెళ్లి విచారణ చేపట్టారు. బాధితుడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యసేవలు అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇన్‌చార్జ్‌ ఎస్సైను సస్పెండ్‌ చేశామని, ఎస్సై, కవల కృష్ణమూర్తితో పాటుగా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సత్యనారాయణరావు తెలిపారు.

ఈ నెల 18వ తేదీ రాత్రి 9.30 గంటలకు మునికూడలి వద్ద ఇసుక లారీ ముగ్గళ్లకు చెందిన బైక్‌ను ఢీకొట్టడంతో ఆ బైక్‌ నడుపుతున్న వ్యక్తి కాలు విరిగింది. దీంతో అక్కడే ఉన్న కొంతమంది ఎస్సీ యువకులు లారీని అడ్డుకుని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగడంతో అక్కడ  ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అదే సమయంలో కారుపై వచ్చిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు, మునికూడలి పంచాయతీ మాజీ సర్పంచ్‌ భర్త కవల కృష్ణమూర్తి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, లారీని పంపేయాలనడంతో యువకులు అతనిపై తిరగబడ్డారు. కాలు విరిగి ఉంటే లారీని పంపమంటారేంటని తీవ్ర వాగ్వాదానికి దిగడమే కాకుండా ఆయన కారు అద్దాలను పగలకొట్టారు.

దీంతో అతను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఐదుగురు యువకులు తనను కొట్టడంతో చేయి గూడె జారిపోయిందని, కారు అద్దాలు పగులకొట్టారని ఈనెల 19న ఫిర్యాదు చేశాడు. ఈనెల 20న ఇన్‌చార్జ్‌ ఎస్సై షేక్‌ ఫిరోజ్‌ షా ఇండుగుమిల్లి ప్రసాద్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి తన సిబ్బందితో కలిసి చేతులు, కాళ్లు, పిరుదులపై తీవ్రంగా కొట్టడమే కాకుండా, ట్రిమ్మర్‌ తెప్పించి, గడ్డం, మీసాలు, తల వెంట్రుకలను తొలగించారు.