Amaravati, Jan 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం (YSSRCP Parliamentary Party Meeting) జరిగింది. ఈ భేటీలో (CM YS Jagan Meeting with MPs) పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత, గొడ్డేటి మాధవి సహా ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ఈనెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (parliament budget sessions) జరుగనున్న నేపథ్యంలో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ఈ సందర్భంగా కీలక చర్చ జరిగింది. పార్లమెంటరీ సమావేశం ముగిసిన అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం నిధులు, ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు. అదే విధంగా... నివర్ తుపాను నష్టపరిహారం విడుదల చేయాలని కోరతామని పేర్కొన్నారు. ‘‘కర్నూలుకు హైకోర్టు తరలింపు అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం. రాష్ట్ర రెవెన్యూ లోటును పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
విశాఖ రైల్వే జోన్ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం’’ అని తెలిపారు. కాగా రాష్ట్రంలో దేవుడి విగ్రహాల ధ్వంసంలో చంద్రబాబు ప్రమేయం ఉందన్న వియసాయిరెడ్డి.. ఆలయాలపై టీడీపీ దాడుల ఘటనపై ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.