Amaravati, Oct 27: వైఎస్సార్ రైతు భరోసా రెండవ విడత పెట్టుబడి సాయాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ప్రారంభించారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు. కరోనా కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అడుగంటిపోయినా వారికి ఇచ్చిన మాట తప్పకుండా రెండవ విడత కింద వైఎస్సార్ రైతు భరోసాను (YSR Rythu Bharosa) వారి ఖాతాలకు బదిలీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ రెండో విడత సాయం కింద 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.13,500 అందిస్తున్నాం. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో 4వేలు, సంక్రాంతికి రూ.2వేలు సాయం అందిస్తున్నాము. ఇప్పటికే మే నెలలో ముందస్తుగా రూ.2వేలు సాయం చేశాం. ఈరోజు మరో రూ.2వేలు రైతు భరోసా సాయం అందిస్తున్నాం. గిరిజన రైతులకు రూ.11,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం. లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం చేస్తున్నామని తెలిపారు.
ఎటువంటి అవినీతి, వివక్ష లేకుండా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. అర్హులందరికీ మేలు జరిగేలా వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేస్తున్నాం. రాష్ట్రంలో 50శాతం మంది రైతులు 1.25 ఎకరా లోపు ఉన్నవారే. పెట్టుబడి సాయంతో మెరుగైన భద్రత, ఉపాధి లభిస్తుంది. తొలిసారిగా ఖరీఫ్ ఇన్‌పుట్ సబ్సిడీ ఖరీఫ్‌లోనే చెల్లిస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు.. ఖరీఫ్ సీజన్‌లోనే ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లించడం ఇదే తొలిసారి. 1.66 లక్షల మంది రైతులకు 135.7 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం' అని అన్నారు.
ఈసారి లబ్ధిదారుల సంఖ్య 50,47,383కి చేరింది. 2019 అక్టోబర్‌లో లబ్ధిదారుల సంఖ్య 46,69,375 మంది మాత్రమే కాగా 2020 మే నెలలో ఖరీఫ్ సమయంలో ఈ సంఖ్య 49,45,470కి చేరింది. ఇప్పుడు రబీలో ఏకంగా 50,47,383కి చేరింది. అంటే ఖరీఫ్‌తో పోల్చుకుంటే మరో 1,01,913 మంది కొత్తగా సాయం పొందనున్నారు. 50,47,383 మంది లబ్ధిదారులకు గాను రూ.1,114.87 కోట్ల సాయం అందనుంది.
రబీ సీజన్‌కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ఆర్‌ఓఎఫ్‌ఆర్) రైతులకూ రైతు భరోసా అందుతుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చింది. 2019 అక్టోబర్ 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించనుంది.