Amaravati, Dec 3: పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan Mohan reddy ) తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఇవాళ ఉదయం తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.ఈ సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ ను కలిసి పీఆర్సీ గురించి వినతి పత్రం సమర్పించారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తైందని, మరో 10 రోజుల్లో (PRC Will announce within 10 days) ప్రకటిస్తామని సీఎం జగన్ తెలిపారు.
ఇది వరకే రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమయిన అన్యాయం జరగకుండా చూస్తామని, పీఆర్సీ విషయంలో కాస్త ఓపికతో వుండాలన్నారు . విజయనగరం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామన్నారు
ఐ.ఆర్. సైతం ప్రకటించామని తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. ఈ విషయంలో ఉద్యోగులు కొంత ఓపిక పట్టాలన్నారు. పురపాలక సంఘాల్లో పనులు చేసిన గుత్తేదారుల బిల్లుల చెల్లింపు., ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఇస్తామని బొత్స స్పష్టం చేశారు. బిల్లుల చెల్లింపు ఆగలేదని, అనవసర రాద్ధాంతం చేసేందుకే కొందరు ఆందోళన చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
గ్రామ పంచాయితీ నిర్వహణ ఖర్చులు చెల్లింపుకే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామన్నారు. ఆ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశ్యం లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు వాస్తవాలు పరిశీలించకుండా ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.