Amaravati, Nov 23: కులాల వారీగా బీసీ గణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేపట్టారు. దీనిపై ఏపీ సీఎం మాట్లాడుతూ.. 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవని అన్నారు. దేశంలో బీసీల జనాభా 52 శాతమని పేర్కొన్నారు. వెనబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు (Caste Wise BC Census) అవసరమని సీఎం స్పష్టం చేశారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కులగణన జరగలేదని తెలిపారు. కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్‌కు తాము మద్దతు పలుకుతున్నామని సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy) చెప్పారు. బ్యాక్‌వార్డ్ క్లాస్ కాదు. బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం తెలిపారు. బ్రిటీష్ వారి పాలనలో మాత్రమే బీసీ గణన జరిగింది.
ఇప్పటికి 90 సంవత్సరాలు గడిచింది. బీసీల జనాభా గణన ఎందుకు అవసరం అనే విషయాన్ని విస్తారంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ తో జనగణన వాయిదా పడింది. బీసీలు లెక్క తేలితేనే ప్రభుత్వాలకు స్పష్టత వస్తుంది. జనగణన లేకపోవడంతోనే బీసీలు వెనకబడిపోయారని తెలిపారు. సామాజికంగా ఆర్థికంగా బీసీలకు న్యాయం జరగడం లేదు. ఈ సంఖ్య తెలిస్తేనే న్యాయం జరుగుతుందని సీఎం తెలిపారు.
బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తెస్తున్నామని, ఈ రెండున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందని అన్నారు. కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నాటి నుంచి బీసీల జనాభా అందాజుగా లెక్కిస్తున్నారు తప్ప కచ్చితమైన లెక్కలేదని తెలిపారు. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ఎదగనివ్వడం లేదని అన్నారు. అందుకోసమే జనగణన చేయాలని సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ ఏపీ ప్రభుత్వ తీర్మానం
తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ నేడు తీర్మానం చేసింది. గత ఏడాది జనవరిలో ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం తెచ్చారు. రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపగా, గత 22 నెలలుగా అది కేంద్రం వద్దే పెండింగ్ లో ఉండిపోయింది. దాంతో శాసనమండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడా సందిగ్ధత తొలగిపోయింది. మండలి రద్దును వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీ సర్కారు తీర్మానం చేయడంతో మండలిని యథావిధిగా కొనసాగించేందుకు మార్గం సుగమం అయింది.