Amaravati, June 29: విజయవాడ గొల్లపూడిలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సు ( Disha App Awareness Drive) జరిగింది. సీఎం జగన్ సమక్షంలోనే వాలంటీర్లు దిశా యాప్ లైవ్ డెమో చేసి చూపించారు. యాప్ నుంచి మెసేజ్ వెళ్లిన వెంటనే భవానీపురం పోలీసులు స్పందించి.. నిమిషాల్లోనే లొకేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని, దిశ యాప్‌పై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి (AP CM YS Jagan) తెలిపారు.
దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్ పేర్కొన్నారు. మంగళవారం ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామానికి చేరుకున్న సీఎం జగన్ (YS Jagan To Attend Disha App Awareness Drive) మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరించారు.
దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలిని, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని సీఎం జగన్ అన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన కలిచివేసిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని గుర్తుచేశారు.
ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్ చెప్పారు. ఫోన్‌లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టం కూడా చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టామని, దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు మాట్లాడుతూ.. నేరం జరగడానికి ముందే దాన్ని నియంత్రించాలనుకోవడం గొప్ప చర్య అని, సీఎం జగన్ నిర్ణయాలతో మహిళలకు నిజమైన స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు సీఎం జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని తాము చూడలేదని వాలంటీర్లు చెప్పారు.