Amaravati, June 28: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 71,758 నమూనాలను పరీక్షించగా 2,224 మందికి పాజిటివ్ నిర్ధారణ (Covid in AP) అయ్యింది. తాజాగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సోమవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి నిన్న 4,714 మంది కోలుకోగా..రాష్ట్రంలో ప్రస్తుతం 42,252 యాక్టివ్ కేసులు (Active Cases) ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కొవిడ్ కారణంగా చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశః జిల్లాల్లో ఇద్దరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరుచొప్పున మృతి చెందారు. ఇప్పటివరకు 2,18,04,691 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఏపీలో కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కరోనా పాజిటివిటీ రేటు ఆధారంగా సడలిపులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండనుంది.
రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత కొనసాగుతుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సడలింపు జిల్లాలివే...
అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం.
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ఉంటుంది. ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో పూర్తి సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 5 రోజుల పని విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలతోపాటు, కార్పోరేషన్లలో ఉద్యోగులు వారానికి ఐదు రోజులే విధులకు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పని చేయాలన్న ప్రభుత్వం.. జూన్ 27 నుంచి ఏడాది పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.