AP Govt Offices Shifting Row Andhra Pradesh High Court adjourned Enquiry On Vigilance Commission | (Photo-Twitter)

Amaravati, July 2: ఏపీ హైకోర్టులో కోవిడ్‌-19 పరిస్థితులను (AP Coronavirus) ఎదుర్కోవడంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి (Jitendra Kumar Maheshwari) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించాలని పేర్కొంటూ ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హన్స్‌రాజ్‌ (hansraj) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ (Ram nath Kovind), సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, సుప్రీం న్యాయమూర్తులకు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాశారు. ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మందికి కరోనా, రాష్ట్రంలో తాజాగా 657 కరోనా కేసులు నమోదు, 15,252కి చేరిన మొత్తం కేసుల సంఖ్య, ఇప్పటివరకు 193 మరణాలు

హైకోర్టు జస్టిస్‌ మహేశ్వరి నిర్లక్ష్యపై చర్యలు, నిర్ణయాల వల్ల ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ బి.రాజశేఖర్‌ మరణం సంభవించిందని, కొందరు ఉద్యోగులకు కరోనా సోకిందని, అంతిమంగా వారం పాటు కోర్టును మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని ఈ లేఖలో హన్స్‌రాజ్‌ పేర్కొన్నారు. న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులు, కక్షిదారుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ప్రమాదరహితంగా హైకోర్టు, కింది కోర్టుల కార్యకలాపాలు సాగేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన నాలుగు పేజీల లేఖ రాశారు.

మే 8న హైకోర్టులో మూసిఉన్న చిన్న ఎయిర్‌ కండీషన్డ్‌ హాలులో ముగ్గురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. హాలంతా న్యాయమూర్తులు, క్లర్కులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, వీఐపీలతో కిక్కిరిసింది. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏర్పాట్ల నిమిత్తం ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ తెల్లవారుజాము 3గంటల వరకు పనిచేశారని లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల చనిపోయిన బి.రాజశేఖర్‌ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు అనారోగ్యం పాలైనా బదిలీల పేరుతో కోర్టుకు పిలిపించారు. ఆయన గుండె జబ్బు బాధితుడు. జస్టిస్‌ జేకే మహేశ్వరి తనపై చెప్పలేనంత భయంకరమైన ఒత్తిడిని మోపుతున్నారంటూ రాజశేఖర్‌ తన సన్నిహితులకు, కుటుంబానికి చెబుతూ వచ్చారు. రాజశేఖర్‌ 24.6.2020 మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైకోర్టులో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. రాజశేఖర్‌ను రోజూ కలుస్తూ వచ్చిన సీజే ఈ రోజుకీ కోవిడ్‌ పరీక్ష చేయించుకోలేదని లేఖలో ఆరోపించారు.