Amaravati, Mar 31: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో అనవసర వ్యయాన్ని కట్టడి చేయాలని అన్ని శాఖలకు ఆర్ధికశాఖ (Finanace ministry) సూచించింది. కోవిడ్ వల్ల ఆదాయ వనరులు తగ్గిపోయినందున ప్రాధాన్యతలను గుర్తించి ఆయా రంగాలకే వ్యయం చేయాలని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote on Account Budget) మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
ఓటాన్ అకౌంట్ కేటాయింపుల మేరకే పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించాలని, కేటాయింపుల్లేని పనులకు బిల్లులను సమర్పించరాదని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు ‘ఓటాన్ అకౌంట్’లో తిరిగి కేటాయింపులకు అనుమతించేది లేదన్నారు. వేతనాలు, పెన్షన్‌లు, గౌరవ వేతనాలు తదితరాలకు నియంత్రణ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు.
కాగా ఏపీలో ఆర్థిక సంవత్సరం 2021-22 మూడు నెలల కాలానికి అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. దీంతో 3నెలల కాలానికి రూపొందించిన ఓటాన్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి అంటే జూన్ నెలాఖరు వరకు సుమారుగా రూ.86 వేల కోట్ల మేర ఓటాన్ అకౌంట్‌కు ఆమోదం లభించింది. రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి వీలు చిక్కలేదని, అందువల్ల ఓటాన్ అకౌంట్‌ను ఆమోదిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, ఇతర చెల్లింపులు జరపాలన్నా బడ్జెట్ ఆమోదం తప్పనిసరి. అది వీలుకానప్పుడు ఓటాన్ అకౌంట్ ఆమోదిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడేళ్లుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాధారణ ఎన్నికల కారణంగా తొలుత మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు.
ఆనక పూర్తిస్థాయి బడ్జెట్‌ను కొత్త ప్రభుత్వం ఆమోదించుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా బడ్జెట్ సమావేశాలకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో ఆ ఏడాదీ తొలుత ఓటాన్ అకౌంట్‌కు ఆర్డినెన్సు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేశారు.