Nimmagadda Ramesh Kumar: నేటితో ముగియనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ పదవీ కాలం, దొరకని గవర్నర్ అపాయింట్‌మెంట్, కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని రేపు బాధ్యతలు, ఎస్‌ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను మూసేసిన హైకోర్టు
AP Election Commissioner Nimmagadda Ramesh Kumar | File Photo

Amaravati, Mar 31: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరగా దొరకలేదని తెలుస్తోంది.గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్‌ కోరుతూ నిమ్మగడ్డ (AP SEC Nimmagadda Ramesh Kumar) నాలుగు రోజుల క్రితమే రాజ్‌భవన్‌ కార్యాలయ అధికారులకు తెలియజేశారు. అయితే నిమ్మగడ్డను కలిసేందుకు గవర్నర్‌ ఆసక్తి చూపలేదని వార్తలు వస్తున్నాయి.

నిన్నంతా ఎదురుచూసినా గవర్నర్ (Biswabhusan Harichandan) నుంచి పిలుపు రాకపోవడం తో రమేష్‌ కుమార్ (Nimmagadda Ramesh Kumar) తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం.కాగా మార్చి 19న తనను అత్యవసరంగా కలవాలంటూ ఒకరోజు ముందు గానే గవర్నర్‌ సమాచారమిచ్చినప్పటికీ.. తాను హైదరాబాద్‌లో ఉన్నానంటూ నిమ్మగడ్డ ఆయన్ను కలవని విషయం తెలిసిందే.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తిచేసే అంశంపై చర్చించేందుకే గవర్నర్‌ అత్యవసరంగా 19న తనను కలవాలని ఎస్‌ఈసీని ఆదేశించగా, తన హయాంలో ఆ ఎన్నికలు జరిపేందుకు ఏమా త్రం ఆసక్తిగా లేని నిమ్మగడ్డ ఏవో కారణాలు చెప్పి అప్పుడు ఆయన్ని కలవలేదన్న విమర్శలున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా (ఎస్‌ఈసీ)గా నియమితులైన మాజీ సీఎస్‌ నీలం సాహ్ని మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్‌ ఒకటో తేదీన ఆమె ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరిస్తారు.

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేను, వేరే వారు నిర్వహిస్తారని తెలిపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్, ఈ నెల 31వ తేదీతో పూర్తి కానున్న ఎస్ఈసీ పదవీకాలం

రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహాయ సహకారాలు అందించాలని గత నవంబరు 3న హైకోర్టు (Andhra Pradesh HC) ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో అప్పటి సీఎస్‌ నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ విఫలమయ్యారంటూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని హైకోర్టు మూసివేసింది. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ... ఎస్‌ఈసీకి నిధుల విడుదల, సహాయ సహకారాలు అందించడంపై ఫిబ్రవరి 22న రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీడింగ్స్‌ ఇచ్చిందన్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేం, ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

వ్యాజ్యంపై విచారణను ముగించాలని కోరారు. ఆ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ వ్యాజ్యంపై విచారణను ముగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యం 42రోజుల పాటు విచారణ జాబితాలో లిస్ట్‌ కాకపోవడానికి బాధ్యులైన హైకోర్టులోని ఓ సెక్షన్‌ ఆఫీసర్‌, డిప్యూటీ సెక్షన్‌ ఆఫీసర్‌పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.