Amaravati, Mar 24: ఈ నెల 31తో తన పదవీ కాలం పూర్తవుతుండటంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను (AP ZPTC and MPTC Elections) నిర్వహించలేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఈ బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయలేనని వివరించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.
దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని.. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని చెప్పారు. హైకోర్ట్ తీర్పునకు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నామని నిమ్మగడ్డ (Nimmagadda Ramesh Kumar) పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పనిచేశారన్నారు. భారత ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తోందని... పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అవలంభించిన మంచి పద్ధతులను అమలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కూడా పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరమే పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ జారీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని ఉత్తర్వులు జారీ చేశారు. 4 వారాల ఎన్నికల కోడ్ విధించాలన్న భాద్యతను నెరవేర్చలేనని పేర్కొన్నారు. నూతన ఎస్ఈసీ భుజ స్కంధాల పైన అన్ని బాధ్యతలు ఉంటాయని నిమ్మగడ్డ తెలిపారు.
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో కొత్త ఎస్ఈసీ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు మైలాపల్లి శామ్యూల్, ఏపీ పునర్విభజన చట్టం అమలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిటైర్డ్ అధికారి ఎల్ ప్రేమ చంద్రారెడ్డి పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో శామ్యూల్‌వైపే జగన్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
నిజానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఐదేళ్లు, లేదంటే 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో ఉండొచ్చు. కానీ, శామ్యూల్ వయసు ప్రస్తుతం 67 ఏళ్లు. దీంతో ఎస్‌ఈసీ పదవిని ఆయనకు ఇచ్చేందుకు గవర్నర్ సానుకూలంగా లేకపోతే, అప్పుడు 65 ఏళ్ల లోపున్న నీలం సాహ్నికి ఆ పదవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వయసుతో పనిలేకుంటే కనుక శామ్యూల్‌కే ఆ పదవి దక్కే అవకాశం ఉంది.