Nellore, Nov 29: కోమరిన్ ప్రాంతం, శ్రీలంక పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains continue) ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంలో 30వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలుత ఇది 29వ తేదీనే ఏర్పడుతుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుతం బ్యాంకాక్ సమీపంలో ఉండడంతో అండమాన్ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం మన రాష్ట్రంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర ఉండే అవకాశం ఉందని తెలిపారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో (various districts of Andhra Pradesh) ఆదివారం వర్షపు జల్లుల మధ్యే రెండు కేంద్ర బృందాలు పర్యటించాయి. అభయ్‌కుమార్, శ్రావణ్‌కుమార్ సింగ్, అనిల్ కుమార్ సింగ్‌లతో కూడిన ఒక బృందం తిరుపతి నుంచి నాయుడుపేట మీదుగా రోడ్డు మార్గంలో నెల్లూరుకు చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కడప నుంచి వచ్చిన కునాల్ సత్యార్థి, కె మనోహరన్, శ్రీనివాసుబైరి, శివన్‌శర్మలతో కూడిన రెండవ బృందం పెన్నా పరీవాహక ప్రాంతాలైన ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి వరద నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది.
ఇసుక మేటలేసిన పంట పొలాలు, చేతికందే దశలో ఉన్న పంటలు నీటి పాలవ్వడం, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, కూలిన ఇళ్లు, కోతకు గురైన చెరువులు, సోమశిల జలాశయం, దెబ్బతిన్న జలాశయ అప్రోచ్ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. బురద మధ్య అల్లాడుతున్న బాధితుల వేదన విన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో వరద నష్టం ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కాగా పెన్నా, కాళంగి, స్వర్ణముఖి నదులు ఉప్పొంగడం వల్ల 23 మండలాల్లోని 109 గ్రామాల్లో అపార నష్టం జరిగింది. ఆయా గ్రామాల్లోని 1,22,254 మంది అష్ట కష్టాలు పడ్డారు. 11 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. 98 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఐదుగురు ప్రాణాలు వదిలారు. వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి. వివిధ శాఖల పరిధిలో రూ.1,190.15 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టర్ చక్రధర్ బాబు కేంద్ర బృందానికి సమగ్ర నివేదిక అందజేశారు.
చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల భారీ వర్షాలు (AP Flash Floods) సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే మళ్లీ ఎడతెరిపిలేని వర్షాలు ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువులు నిండు కుండల్లా తొణికిసలాడుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు మళ్లీ జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఆదివారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మరోసారి జల దిగ్బంధంలో (Andhra Pradesh Floods) చిక్కుకున్నాయి.
తాజాగా తిరుమలకు రాకపోకలపై ఆంక్షలు విధించారు. ద్విచక్ర వాహనాలకు ఘాట్ రోడ్డులో అనుమతి లేదని టీటీడీ ప్రకటించింది. వర్షం ఆగిన సమయంలో నాలుగు చక్రాల వాహనాలను అనుమతిస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలను మూసి వేశారు. తిరుమల ఘాట్ రోడ్డులో అక్కడక్కడ కూలిన వృక్షాలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో భక్తులను అనుమతిస్తున్నారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు.
తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం డ్యాంల నుంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఆ నీరు తిరుపతిలోని కపిలతీర్థం నుంచి తిరుపతి నగరంలోని లోతట్టు ప్రాంతాలకు చేరుతోంది. శేషాచలం కొండల్లో నుంచి వచ్చే వరద నీరు కళ్యాణీ డ్యాంకు చేరుతుండడంతో నీటి విడుదల యథాతదంగా కొనసాగుతోంది. కలెక్టర్ హరినారాయణన్, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న అరణియార్, కాళంగి రిజర్వాయర్, కల్యాణి డ్యాం, రాయలచెరువును పరిశీలించారు.
స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. అవసరమైతే దిగువ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని అంచనా వేసి.. ప్రజలకు, పంటలకు ఇబ్బంది లేకుండా దిగువకు వదలాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసే సమయంలో నెల్లూరు జిల్లా వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, పల్లపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కొంత మంది భయంతో ముందస్తుగా ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు తరలిపోతున్నారు. చిత్తూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నవంబర్‌లో 142.6 మి.మీ వర్షపాతం నమోదు కావలసి ఉండగా, రెండు పర్యాయాలు వచ్చిన తుపాను కారణంగా 438.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
అనంతపురం జిల్లాలోని అప్పర్ పెన్నార్ (పేరూరు) డ్యామ్ నుంచి నెల్లూరు బ్యారేజీ వరకు పెన్నా నది ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతుండటంతో జల వనరుల శాఖ అధికారులు ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. పెన్నా నది చరిత్రలో ఇలా ఇదే తొలిసారి. రెండు దశాబ్దాల తర్వాత అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు నిండటం గమనార్హం. రానున్న రెండు రోజుల్లో వర్షాల కారణంగా పెన్నా నది ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ముప్పును తప్పించడానికి ముందు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టుల్లో కొంత భాగాన్ని ఖాళీగా ఉంచడానికి గేట్లు ఎత్తేశారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏఎస్ పేట మండలం, తెల్లపాడు వద్ద కలుజువాగు ఆత్మకూరు నుంచి ఏఎస్ పేటకు రాకపోకలు నిలిచిపోయాయి. నక్కల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏఎస్ పేట నుంచి నెల్లూరు, కలిగిరికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతసాగరం చెరువు అలుగు, కొమ్మలేరు వాగులు రోడ్లపై ప్రవహించడంతో సోమశిల నుంచి ఆత్మకూరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంగం పెన్నా వారధి వద్ద ఉధృతంగా పెన్నా నది ప్రవహిస్తోంది. దీంతో సంగం నుంచి చేజర్ల, పొదలకూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. మర్రిపాడు మండలంలోని కేతామన్నేరు వాగు రోడ్డుపై పొంగిపొర్లుతోంది. దీంతో పడమటి నాయుడు పల్లికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు అన్నదాత కంట నీరు తెప్పిస్తున్నాయి. వారం క్రితం కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, ప్రస్తుత వర్షాలతో నిండా మునిగిపోయినట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో వరి, పత్తి, మిర్చి, శనగ, వేరుశనగ, టమాటా, ఉల్లి, ఇతర ఉద్యాన పంటలకు తీరని నష్టం వాటిల్లుతోంది. మరో రెండ్రోజులు వర్షం కొనసాగితే కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలి కంకులు మొలకెత్తుతాయని రైతు లు వాపోతున్నారు. కృష్ణా జిల్లాలో పత్తి రెండు, మూడు తీత దశల్లోఉంది. వర్షానికి నడివిరుపు తీతదశలో ఉన్న పత్తి తడిసి రంగు మారిపోతుందని ఆందోళన చెందుతున్నారు.