Amaravati, Nov 25: కరోనావైరస్ ని మరింత సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కేంద్రం కోవిడ్ అత్యవసర నిధి నుంచి ఏపీకి రూ.981 కోట్లు సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇందులో భాగంగా మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో (Union Health Minister Harshavardhan) జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై బుగ్గన రాజేంద్రనాథ్ చర్చించారు.
కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్–19 పరీక్షలను, కోవిడ్ కేర్ సెంటర్లను, ఐసీయూ, నాన్ ఐసీయూ పడకలను పెంచడం, తాత్కాలిక సిబ్బంది నియామకాల్ని చేపట్టడం కారణంగా రాష్ట్రంపై ఆర్థిక భారం ఎక్కువగా ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ (AP FM Buggana Rajendranath) మీడియాతో మాటాడుతూ.. కరోనా విపత్తు నేపథ్యంలో కోవిడ్ అత్యవసర నిధి (covid emergency fund) నుంచి రాష్ట్రానికి రూ.981 కోట్లు సాయం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని, ఇందుకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించాలని కోరామని బుగ్గన వివరించారు. 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చేసిన విజ్ఞప్తిని కేంద్ర మంత్రి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,085 కరోనా కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో పాజిటివ్‌ల సంఖ్య 8,63,843కి చేరింది. తాజాగా కృష్ణాజిల్లాలో 224 మంది, చిత్తూరులో 142, పశ్చిమగోదావరిలో 138, గుంటూరులో 126, తూర్పుగోదావరిలో 116 మంది వైరస్ బారిన పడ్డారు. 24 గంటల్లో కృష్ణాజిల్లాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, కడప, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. కాగా, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.