omicron

Amaravati, Dec 24: ఒమిక్రాన్ వేరియంట్ కి ఆయుర్వేదం మందు తన దగ్గర ఉందని ప్రభుత్వం అనుమతిస్తే దాన్ని తయారు చేసి ప్రజలకు పంచుతానంటూ ఈ మధ్య కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందును ఇంత వరకు ప్రభుత్వం (AP government) అనుమతించలేదని రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ రాములు (AYUSH commissioner Ramulu) గురువారం స్పష్టం చేశారు.

ఒమిక్రాన్‌ సోకకుండా, సోకిన వారికి తగ్గేలా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తామని కొందరు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒమిక్రాన్‌ను (Coronavirus Omicron) నివారించే ఆయుర్వేద మందు ఉచిత సరఫరా, అమ్మకానికి అనుమతి కోరుతూ ఆయుష్‌ శాఖను ఇంత వరకూ ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కరోనా నిరోధక ఆయుర్వేద మందు ఆయుష్‌–64, ఆర్సెనిక్‌ ఆల్బమ్‌–30 వంటి హోమియో మందులను వైద్యుల సలహా మేరకు మాత్రమే ప్రజలు తీసుకోవచ్చని వివరించారు.

ఇక విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందు తయారు చేశామని చెప్పిన ఆనందయ్య.. తాజాగా కేవలం 48 గంటల్లోనే వ్యాధిని నయం చేస్తానని ప్రకటించారు. గతంలో కరోనా కోసం తయారు చేసిన మందుకు కొన్ని మూలికలు జోడించి.. ఒమిక్రాన్‌ వేరియంట్‌‌కు ఆయుర్వేద మందును సిద్ధం చేశామని తెలిపారు. ఇది ఒమిక్రాన్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన నమ్మకంగా చెప్పారు. ఈ మందును కూడా ఉచితంగా అందిస్తామని.. తన మందు వల్ల ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు.

కడప జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన, రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారతాయని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

ఒమిక్రాన్ ఉన్నవారు తనను సంప్రదిస్తే.. తానే వచ్చి స్వయంగా మందు అందిస్తానని ఆనందయ్య తెలిపారు. కేవలం 48 గంటల్లోనే ఒమిక్రాన్‌ నయం అవుతుందన్నారు. ఒమిక్రాన్ బారిన బాధితుల కుటుంబ సభ్యులు సంప్రదిస్తే.. ఆయుర్వేద మందు అంజేస్తామని చెప్పారు. ఎక్కువ మోతాదులో కావాలంటే ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఆయుష్ కీలక వ్యాఖ్యలు చేసింది.

జగన్ సర్కారు మరో షాక్, ఏపీలో పలు థియేటర్లు సీజ్‌, కృష్ణాజిల్లాలో 15 థియేటర్లు, విజయనగరం జిల్లాలో 3 సినిమా హాళ్లు సీజ్ చేశామని తెలిపిన అధికారులు

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య ఆయుర్వేద మందు గురించి జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆనందయ్య మందు తయారు చేసి పంపిణీ చేయడం మొదలు పెట్టగానే పెద్ద ఎత్తున జనాలు గుమికూడి నానా హంగామా సృష్టించారు. దీంతో ప్రభుత్వం మందు పంపిణీపై తాత్కాలికంగా ఆంక్షలు విధించడంతో ఆ తర్వాత కోర్టు అనుమతితో పంపిణీ సజావుగా సాగింది. అత్యవసర సమయంలో వినియోగించే చుక్కల మందుపై ఇంకా రగడ జరుగుతూనే ఉంది. ఇక తాజాగా ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ఆనందయ్య మళ్లీ తెరపైకి వచ్చారు. ఈసారి కూడా కరోనాని పడగొట్టే మందు ఉందని ప్రచారం చేపట్టారు.

మందును ఎలా వాడాలో చెబుతున్న ఆనందయ్య:

ఈమందును ముందస్తుగా ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకోవాలని ఆనందయ్య సూచించారు. దీనిని మార్చి మొదటి వారం వరకు వాడాల్సి ఉంటుందని తెలిపారు. మార్చి తర్వాత వచ్చే ఎండాకాలంలో ఈ వైరస్ తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ఈ ఒమిక్రాన్ వైరస్ విరుగుడు మందు అటు విశాఖలోనూ, ఇటు కృష్ణ‌పట్నంలోనూ పంపిణీని చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం తన మొబైల్ నంబర్ 9100036881ని సంప్రదించాలని కోరారు ఆనంద‌య్య‌.