
Amaravati, Oct 23: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు (AP Local Body Elections) సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చాలా వరకు కూడా జాగ్రత్తగా ముందుకు వెళుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ హైకోర్ట్ వేసిన ప్రశ్నలు, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలొ ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి (Mekapati Goutham Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా నిర్వహించలేము అని స్పష్టం చేసారు. డిసెంబర్ లోపు కరోనా సెకండ్ వేవ్ వచ్చే (Covid Second Wave) అవకాశం ఉంది అని, ఏ వైరస్ అయినా రెండు మూడు సార్లు వస్తుందని అన్నారు. అప్పుడు పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నవంబర్ తర్వాత పరిస్థితి గమనించి నిర్ణయం తీసుకుంటామని, బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరి కాబట్టి నిర్వహిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
తాడేపల్లిలో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ సమావేశంలో పాల్గొన్న అనంతరం గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నవంబర్ నెలలో కోవిడ్ కేసులు పెరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బిహార్ వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తప్పనిసరి అని, మన దగ్గర జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే కేంద్రం అన్ లాక్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈమేరకు అన్ని రాజకీయ పార్టీలతో ఈ నెల 28న ఏపీ ఎన్నికల సంఘం సమావేశం అవుతోంది. స్థానిక ఎన్నికలపై ఈ సమావేశంలో ఆయా పార్టీల అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) ఓ ప్రకటన జారీ చేశారు. ఈ సమావేశాన్ని సాధారణ ప్రక్రియలో భాగంగానే నిర్వహిస్తున్నామని, కరోనా జాగ్రత్తలు తీసుకుని సమావేశం నిర్వహిస్తామని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని తెలిపారు.