Assembly Elections 2021- Representational Image | (Photo-PTI)

Amaravati, Mar 10: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో ( AP Municipal Elections 2021) సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57 పోలింగ్‌ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 71 పురపాలికలు, 12 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,794 డివిజన్లు, వార్డు స్థానాల్లో 580 చోట్ల ఏకగ్రీవం కాగా మిగిలిన 2,214 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది.

జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ శాతాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో 59.93%, విజయనగరం 56.63%, విశాఖ 47.86%, తూర్పుగోదావరి 66.21%, పశ్చిమగోదావరి 53.68%, కృష్ణా 52.87%, గుంటూరు 54.42%, ప్రకాశం 64.31%, నెల్లూరు 61.03%, అనంతపురం 56.90%, కర్నూలు 48.87%, కడప 56.63%, చిత్తూరు 54.12% చొప్పున పోలింగ్‌ నమోదైంది.

బిర్యాని ప్యాకెట్లలో ముక్కు పుడకలు, పడమట లంకలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్, విశాఖపట్నంలో ఓటేసిన విజయసాయి రెడ్డి, ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయని తెలిపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ

మచిలీపట్నం 25వ డివిజన్‌లో పోలీసులపై కొల్లు రవీంద్ర దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పోలింగ్ బూత్‌ల పర్యవేక్షణకు వెళ్లకూడదని,144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు చెబుతున్నా పోలీసులపై చేయి చేసుకుని ఎస్‌ఐని నెట్టివేశాడు. ప్రకాశం జిల్లా అద్దంకి 20వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం టీడీపీ చీఫ్ ఏజెంట్ విషయంలో చిన్న వివాదం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి బూత్ వద్దకు వచ్చాడు. దీంతో వైఎస్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ కృష్ణ చైతన్య కూడా అక్కడ చేరుకున్నారు. రెండు వర్గాల అనుచరులతో నేతలు బూత్ బయట కూర్చొన్నారు.

అనంతపురం జిల్లాలోని కదిరి 3వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తిరుపతి 43వ డివిజన్‌లో టీడీపీ దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేసింది. చివరి నిమిషంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు గుర్తించి అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఐదుగురు మహిళలు సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రామచంద్రాపురం మండలం మొండేడుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

విశాఖపట్నంలో ఏయూ హైస్కూల్‌ బూత్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హల్‌చల్‌ సృష్టించారు. అనుచరులతో బూత్‌కు వచ్చిన వెలగపూడిని పోలీసులు అడ్డుకున్నారు. గొడవలు సృష్టించడానికే వెలగపూడి వచ్చారంటూ వైఎస్సార్‌సీపీ ఆందోళన చేసింది. టీడీపీ కార్యకర్తలు.. బూత్‌ వద్ద నినాదాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వెలగపూడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులోని విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వస్తున్న టీడీపీ అభ్యర్థిని పోలీసులు బయటకు నెట్టివేశారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి కొమ్మినేని కోటేశ్వరరావు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎంపీ గల్లా జయదేవ్, పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు శ్రావణ్ ఆందోళన చేశారు.

కర్నూలు:జిల్లాలోని నంద్యాల 23 వార్డు పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలు దొంగ ఓటు వేయించేందుకు ప్రయత్నించగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రావడంతో గొడవ సర్దుమణిగింది.