Image used for representational purpose | (Photo Credits: PTI)

Amaravati, Mar 10: రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎప్పటికప్పుడు మున్సిపల్‌ ఎన్నికల సరళిని (AP Municipal Elections 2021) కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు కృష్ణా జిల్లా- 32.64 శాతం, చిత్తూరు జిల్లా-30.12 శాతం, ప్రకాశం జిల్లా-36.12 శాతం, వైఎస్సార్‌ జిల్లా -32.82 శాతం, నెల్లూరు జిల్లా-32.67 శాతం, విశాఖ జిల్లా-28.50 శాతం, కర్నూలు జిల్లా -34.12 శాతం, గుంటూరు-33.62 శాతం, శ్రీకాకుళం-24.58 శాతం, తూర్పుగోదావరి-36.31శాతం, అనంతపురం-31.36 శాతం, విజయనగరం-31.97 శాతం, పశ్చిమ గోదావరి-34.14 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు (AP Municipal Polls 2021) జరుగుతున్నాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని, భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నానన్నారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా చూస్తామని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్‌ఈసీ పిలుపునిచ్చారు.

ఎప్పటికప్పుడు మున్సిపల్‌ ఎన్నికల సరళిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నికల అధికారి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్ లో నిఘా ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. ఓటర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోందన్నారు. పోలింగ్ కేంద్రాల బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకూ ఎటువంటి సంఘటనలు లేవన్నారు. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా దగ్గరలో ఉన్న ఎన్నికల, పోలీస్ అధికారులను వెంటనే అలెర్ట్ చేస్తామని ప్రసన్న వెంకటేష్‌ పేర్కొన్నారు.

ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు అడుగుతున్నారా, 18 ప్ర‌త్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల‌లో ఏద‌యినా చూపించవచ్చని తెలిపిన ఎన్నికల కమిషన్

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు విజయవాడలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా బాధ్యతతో తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని ప్రజలంతా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అనంతపురంలో టీడీపీ నేత కందికుంట ప్రసాద్ దౌర్జన్యానికి తెరలేపారు. 29వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులపై కందికుంట దురుసుగా ప్రవర్తించారు. సీఐ మధుసూధన్‌ను కందికుంట ప్రసాద్‌ దుర్భాషలాడారు.

మంత్రి బొత్స సత్యనారాయణ తన ఓటు హక్కు వినియోగించు​కున్నారు. మహారాజా కళాశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. మున్సిపల్‌లో విజయం సాధించిన అభ్యర్థులు మరింత బాధ్యతగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చే ఓట్లర్ల వద్ద సెల్‌ఫోన్లు ఉన్నప్పటికీ.. ఎటువంటి అభ్యంతరం వద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే చాలని ఎస్‌ఈసీ తెలిపారు.

కడప జిల్లా బద్వేల్‌ మున్సిపాలిటీలోని 16వ వార్డులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఓవైపు పోలింగ్ జరుగుతుంటే.. మరోవైపు వైసీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ప్రొద్దుటూరులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 5వ వార్డు వైసీపీ అభ్యర్థి మురళీధర్ రెడ్డి అనుచరులు హల్ చల్ చేశారు. దీనిపై టీడీపీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

ఏపీలో పుర, నగర పాలక పంచాయతీల్లో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్‌, ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని, విశాఖ జిల్లా భీమిలి నేరెళ్లవలసలో అవంతి శ్రీనివాస్‌, వైఎస్సార్‌ జిల్లా కడప 29వ డివిజన్‌లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రకాశం జిల్లా ఒంగోలు 34వ డివిజన్‌లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు.

విశాఖపట్నం మారుతీనగర్ పోలింగ్ బూత్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి సతీసమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 50వ నంబర్‌ పోలింగ్ బూత్‌కి వచ్చిన ఎమ్మెల్యే.. గంటసేపు క్యూలో నిల్చుని ఓటు వేశారు..

విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమట లంక కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పోలింగ్‌ బూత్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి దంపతులు, గుంటూరు హిందూ కాలేజీలో ఎమ్మెల్యే మద్దాల గిరి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని నెహ్రూ మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.

విజయనగరం కణపాక యూత్ హాస్టల్ లోని పోలింగ్‌ బూత్ లో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఖండే శ్యాంసుందర్‌లాల్‌ ఓటర్లను డబ్బు, బంగారంతో మభ్యపెట్టాలని చూశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిపించాడు. మంగళవారం బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు పంపిణీ చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్రస్వామి, రవికిరణ్, మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు బైకులు,రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియామావళి అతిక్రమణ కింద కేసు నమోదు చేశారు.