Amaravati, Nov 15: ఏపీలో పెండింగ్ పంచాయితీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈ రోజున పోలింగ్ (2021 Andhra Pradesh rural local bodies elections) నిర్వహించింది. మొత్తం 68 స్ధానాల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇప్పటికే 30 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. 36 పంచాయితీల్లో సర్పంచ్ స్ధానాలకు ఆదివారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది, అదే రోజు సాయంత్రం ఫలితాలను (AP Panchayat Election Results 2021) ప్రకటించారు. 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెల్చుకున్నారు. 27 సర్పంచ్ పదవుల్ని, 47 వార్డుల్ని అధికార పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.
పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా.. మొత్తం 69 సర్పంచి, 533 వార్డు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేశారు. వాటిలో 30 సర్పంచ్, 380 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు సర్పంచ్ స్థానాలకు, 85 వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 36 సర్పంచ్, 68 వార్డు పదవులకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం వెంటనే ఆ గ్రామంలోనే ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించారు. 8 సర్పంచ్ పదవులు, 14 వార్డులను టీడీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. సీపీఐ మద్దతుదారు ఒక సర్పంచ్ పదవిని గెలుచుకోగా, జనసేన మద్దతుదారులు 7 వార్డులను దక్కించుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 6 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులే గెలిచారు. విజయనగరం జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఒకటి, టీడీపీ మద్దతుదారులు ఒకటి గెలుచుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో 4 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో వైసీపీ మద్దతుదారులు 3, టీడీపీ మద్దతుదారులు ఒకటి గెలుకున్నారు. తూర్పు గోదావరిలో రెండు స్థానాల్లో ఒకటి వైసీపీ మద్దతుదారు, ఒకటి టీడీపీ మద్దతుదారు, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు మూడు స్థానాల్లో వైసీపీ మద్దుతుదారులు గెలిచారు.
కృష్ణా జిల్లాలో నాలుగు స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు రెండు, టీడీపీ మద్దతుదారులు రెండు స్థానాలు, గుంటూరులో 5 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు, ప్రకాశంలో జరిగిన 1 స్థానానికి టీడీపీ మద్దతుదారు, చిత్తూరు జిల్లాలో రెండు స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచారు. కర్నూలులో మూడు సర్పంచ్ స్థానాలకు గాను వైసీపీ మద్దతుదారులు ఒకటి, టీడీపీ మద్దతుదారులు ఒకటి, సీపీఐ ఒకటి గెలుచుకోగా, అనంతపురం జిల్లాలో 4 స్థానాలకు గాను వైసీపీ మద్దతుదారులు మూడు, టీడీపీ మద్దతుదారులు ఒకటి గెలుచుకున్నారు. ఇక నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికలు గతంలోనే ముగిసాయి.
మొత్తం 68 వార్డు స్థానాల్లో మొత్తం 47 స్థానాలు వైసీపీ మద్దతుదారులు గెలుచుకోగా, టీడీపీ మద్దతుదారులు 14 స్థానాల్లో జనసేన మద్దతుదారులు 7 స్థానాల్లో గెలుపొందారు. విశాఖలో రెండు వార్డు స్థానాలు, కృష్ణాలో ఒకటి, గుంటూరులో 4 వార్డు స్థానాల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. టీడీపీ మద్దతుదారులు విజయనగంలో ఒకటి, విశాఖలో మూడు, తూ. గోదావరిలో ఒకటి, ప. గోదావరిలొ ఒకటి, కృష్ణాల రెండు, ప్రకాశంలో నాలుగు, కడపలో ఒకటి, కర్నూలులో ఒకటి చొప్పున గెలుపొందారు. మిగతా 47 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు.