Amaravati, Nov 15: ఏపీలో వివిధ కారణాల వల్ల ఏపీలో ఆగిపోయిన మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపల్, నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ (AP Municipal Election 2021) ఈ ఉదయం ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మునిసిపాలిటీలకు పోలింగ్ (AP Municipal And Nagar Panchayat Elections 2021) కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎన్నికల (Andhra Pradesh Corporation Election ) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో అకివీడు, కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లాలో దాచేపల్లి, గురజాల. ప్రకాశం జిల్లాలో దర్శి, నెల్లూరు జిల్లాలో బుచ్చి, చిత్తూరు జిల్లాలో కుప్పం, కర్నూలు జిల్లాలో బేతంచర్ల, కడపజిల్లాలో కమలాపురం, రాజంపేట్, అనంతపురం జిల్లాలో పెనుకొండ మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతోంది. అవసరమైన చోట రీపోలింగ్ ఉంటుంది. బుధవారం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత, నిఘా పర్యవేక్షణ జరపాలని అన్ని జిల్లాల అధికారులను ఎస్ఈసీ నీలం సాహ్ని ఆదేశించారు. కాగా ఎన్నికల కోసం నంబర్ 1న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్/వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. వీటిలో 28 స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన 325 స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగుతోంది. ఆయా స్థానాలకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ సహా వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి మొత్తం 1,206 మంది పోటీ పడుతున్నారు. 908 పోలింగ్ కేంద్రాల్లో 8,62,066 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 349 సమస్యాత్మక, 239 అత్యంత సమస్యాత్మక, 38 సాధారణమైనవిగా గుర్తించారు. 2,038 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరించడంతో పాటు, వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు.
ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిసి 4 వేల మందికిపైగా పోలింగ్ విధుల్లో ఉన్నారు. 556 సూక్ష్మ పరిశీలన, 81 రూట్ ఆఫీసర్‌లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లాలోని గురజాల, దాచేపల్లిలో 144 సెక్షన్ అమలులో ఉందని డీఎస్పీ విజయ భాస్కర్ తెలిపారు. మన్సిపల్ ఎన్నికల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలీంగ్ ప్రశాంతంగా సాగుతోందని చెప్పారు. భయపడకుండా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు పోలీస్ రక్షణ కోరితే కల్పిస్తామని డీఎస్పీ విజయ భాస్కర్ తెలిపారు