AP SEC Neelam Sahni (Photo-Twitter)

Amaravati, Sep 19: ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికకు (MPP, ZP Chairman Elections 2021) రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు తేదీలు ఖరారు చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ.. 25న మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు.

ప్రతిసారి జిల్లా పరిషత్‌లో ఛైర్మన్‌, ఒక వైస్‌ ఛైర్మన్‌ను సభ్యులు ఎన్నుకునేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు చేయడంతో రెండో వైస్‌ ఛైర్మన్‌ను సైతం ఎన్నుకోనున్నారు. నగరపాలక సంస్థల్లో, పురపాలక సంఘాల్లోనూ రెండో డిప్యూటీ మేయర్‌, రెండో వైస్‌ ఛైర్మన్ల స్థానాలను కూడా కొత్తగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ దూకుడు కనబరుస్తోంది. అన్ని జిల్లాలో మెజార్టీ సీట్లను ఇప్పటికే కైవసం చేసుకుంది.

అన్ని జిల్లాలో ఆధిక్యంలో దూసుకుపోతున్న వైసీపీ, చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ జోరు, ఇప్పటివరకు అందిన ఫలితాల్లో అధికార పార్టీదే హవా

మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు ఇలా..

20వ తేదీలోపు ఎంపీటీసీ సభ్యులందరికీ ప్రత్యేక సమావేశంపై నోటీసులు.

24న ఉదయం 10 లోపు మండల పరిషత్‌లో కో ఆప్షన్ సభ్యుడి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నిక.

మధ్యాహ్నం 1 గంట: కో ఆప్షన్ సభ్యుడి ప్రమాణ స్వీకారం

3 గంటలకు: ప్రత్యేక సమావేశంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపిక

జెడ్పీ చైర్మన్ ఎన్నిక

జెడ్పీటీసీలకు 21వ తేదీలోపు ప్రత్యేక సమావేశంపై నోటీసులు

25వ తేదీన ఉదయం పది గంటలలోపు ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ

ఉదయం పది నుంచి ఒంటి గంట లోపు స్క్రూటినీ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక

మధ్యాహ్నం ఒంటి గంట: కోఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం

3 గంటలకు: జెడ్పీ చైర్ పర్సన్, రెండు వైఎస్ చైర్మన్లకు ఎన్నిక

  • ఎంపీపీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ నామినేట్ చేసిన గెజిటెడ్ అధికారి వ్యవహరించనున్నారు.
  • జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్న కలెక్టర్లు
  • ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు అనివార్య కారణాల నిర్వహించలేకపోతే మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలి.
  • ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికల సమావేశానికి ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా అనుమతి. ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు.