Amaravati, July 27: కృష్ణా జిల్లా గుడివాడలో రెండు రోజుల క్రితం బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ (Gudivada woman) ఎట్టకేలకు పోలీసులకు దొరికింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గుడివాడ టూ టౌన్ సీఐ వి.దుర్గారావు మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ పట్టణంలో నివాసముండే వివాహిత మహిళ (31) స్థానికంగా ఉండే చిన్నారులతో నిత్యం సెల్‌ఫోన్‌లో హౌసీ గేమ్ ఆడుతూ ఉండేది. ఈ సమయంలోనే ఆమె ఎదురింట్లో నివాసముండే బాలుడు(14) ఆ వివాహిత పట్ల ఆకర్షితుడయ్యాడు. వీరి మధ్య కొద్ది రోజులకు చనువు పెరగడంతో బాలుడిని ఆమె శారీరకంగా లొంగదీసుకుంది.
ఈ నేపథ్యంలో స్థానిక ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న బాలుడు సరిగా పాఠశాలకు కూడా వెళ్లకుండా ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఇది గమనించి బాలుడి తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. ఈ విషయం బాలుడు ఆమెతో చెప్పాడు. దీంతో బాలుడు తనకు దూరమవుతాడని భావించిన మహిళ అతనికి మాయమాటలు చెప్పి ఈనెల 19న బలవంతంగా (‘abducting’ minor boy) హైదరాబాద్ తీసుకెళ్లింది.తన నలుగురు పిల్లలు, భర్తను వదిలేసి బాలుడిని తీసుకొని హైదరాబాద్ వెళ్లి పోయింది. హైదరాబాద్ బాలానగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బాలుడితో (Married woman kidnaps Boy) సహజీవనం చేస్తోంది.
అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత బాలుడు గుడివాడలోని తన ఇంటికి వెళ్లాలని భావించాడు. తన వద్ద డబ్బులు లేవని.. స్పందించి డబ్బులు పంపాలని స్నేహితులు, చుట్టు పక్కల వారికి ఫోన్‌లో మెస్సేజ్ పెట్టాడు. ఎవరూ స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను హైదరాబాద్‌లో ఉన్నానని, ఇంటికి వస్తానని చెప్పాడు. అప్పటికే జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు గుడివాడ టూటౌన్ స్టేషన్ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు ఏపీలోని వివిధ జిల్లాల్లో బాలుడి కోసం గాలింపు చేపట్టాయి.
ఓ బృందం బాలుడు మాట్లాడుతున్న సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా గుర్తించి వారున్న ఇంటికి వెళ్లారు. మంగళవారం రాత్రి బాలానగర్‌లో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని బుధవారం ఉదయం గుడివాడ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వివాహితపై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.