AP Cinema Tickets Row: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, సినిమా టికెట్ల విక్రయానికి ప్రత్యేక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం, APSFTVTDCకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ
AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, Dec 20: సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రైల్వే టికెట్లు విక్రయించే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) తరహాలో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్‌ టికెట్ల అమ్మకాల (AP Cinema Tickets Row) బాధ్యతలను ‘ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APSFTVTDC)కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ నెల 17వ తేదీన సర్కారు జీవో 142 జారీ చేసింది. సినిమా టికెట్ల ఆన్‌ లైన్‌ బుకింగ్‌ విషయంలో ఈ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సొంతంగా ఒక వెబ్‌పోర్టల్‌ను రూపొందించనుంది. దాని ద్వారానే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసేలా విధివిధానాలు, సాప్ట్‌వేర్‌ను రూపొందించనుంది. ఆంధ్రప్రదేశ్‌ సినిమా చట్టంలో ఈ మేరకు సవరణలు ప్రతిపాదించి ఈ నెల 15న నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. ‘‘ప్రభుత్వ కంపెనీ రూపొందించే ఆన్‌లైన్‌ విధానంలో బుక్‌ చేసే టికెట్లనే సినిమా ప్రదర్శనకు అనుమతించాలి. ప్రైవేటుగా సినిమా టికెట్‌ బుకింగ్‌, అమ్మకాలకు ఎవ్వరికీ అనుమతి లేదు. ఎవ్వరికీ కొత్తగా లైసెన్స్‌ ఇవ్వడం లేదు’’ అని అందులో పేర్కొన్నారు. దీని ప్రకారం ఏ సినిమా టికెట్‌ అయినా ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరే షన్‌ రూపొందించే ఆన్‌లైన్‌ విధానంలోనే బుక్‌ చేయాలి. త్వరలో ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ పోర్టల్‌, ఇతర విధివిధానాలపై ఆదేశాలు వెలువడనున్నాయి.

థియేటర్ల యజమాన్యాలు టికెట్‌ ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ ముందుంచాలి, ధరలపై జేసీయే నిర్ణయం తీసుకుంటారు, సినిమా టికెట్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రభుత్వం తాజా ఉత్తర్వుల మేరకు బుక్‌ మై షో వంటి ప్రైవేటు ప్లాట్‌ఫాంల ద్వారా ఇప్పటివరకు సాగిన ఆన్‌లైన్‌ టికెట్‌ అమ్మకాలు ఇకపై కుదరదు. సినిమా థియేటర్లతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం ప్రభుత్వం నిర్దేశించిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం(గేట్‌వే) ద్వారానే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ త్వరలో అందుబాటులోకి రానుంది.