AP-TS Bus Services Row: తెలంగాణకు నో సర్వీస్, సరిహద్దుల వరకే ఏపీ బస్సులు, నాలుగోసారి విఫలమైన రెండు రాష్ట్రాల ఆర్టీసీ చర్చలు, మళ్లీ త్వరలో భేటీ అయ్యే అవకాశం
APSRTC MD Krishna Babu (Photo-Twitter)

Amaravati, Oct 24: అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణా, ఏపీఎస్‌ ఆర్టీసీల మధ్య చర్చలు (AP-TS Bus Services Row) కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల నాలుగో విడత చర్చలు కూడా విఫలం (Interstate Bus Service Standoff) అయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లే ప్రతిపాదనలు పంపించామని, రూట్ల వారీగా స్పష్టత ఇచ్చామని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం మీడియాకు తెలిపారు. అయినప్పటికీ తెలంగాణ ముందుకు రావడం లేదని తెలిపారు.

ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) 1.04 లక్షల కి.మీ. తగ్గించుకుందని, 1.61 లక్షల కి.మీకే పరిమితం అయ్యామని ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనలతో ఏపీఎస్‌ఆర్టీసీకి నష్టం వస్తున్నా ప్రయాణికుల ఇబ్బందులను దృష్ట్యా టీఎస్‌ఆర్టీసీ (TSRTC) డిమాండ్లకు అంగీకరించామని వివరించారు. ఈ నెల 19నే తుది ప్రతిపాదనలు పంపించామని, వాళ్లు కోరినట్లు ప్రతిపాదనలు పంపినా ఇంకా గందరగోళం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

తెలంగాణలో తాజాగా 1,273 మందికి కరోనా, ఇప్పటివరకు 1303 మంది మృతి, కరోనా బాధిత జర్నలిస్టులకు రూ.3 కోట్ల సాయం

ఇక దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. పండుగ సందర్భంగా ప్రయాణికులు సౌలభ్యం కోసం ఏపీ సరిహద్దుల వరకూ బస్సులు నడిపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ (విజయవాడ జోన్) ఈడీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దసరా సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి విజయవాడకు బస్సులు ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌కు బస్సులు నడపలేకపోతున్నామని, అయితే సరిహద్దుల దాక నడుపుతామని తెలిపారు. విజయవాడ నుంచి గరికపాడు వరకూ, గుంటూరు జిల్లాలో చెక్‌పోస్ట్‌ వరకూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ఈ తరహా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. విజయవాడ - హైదరాబాద్‌ రూట్లో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తగ్గించాలని తెలంగాణ అధికారులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు 322 బస్సులను తగ్గిస్తూ ప్రతిపాదనలు పంపించాం. ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరేలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీలు 70 వేల కి.మీ. చొప్పున బస్సులు నడుపుదామని ప్రతిపాదించినా వారు అంగీకరించలేదు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రోజుకు రూ. 3.50 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు.

ఏపీలో 31 వేలకు చేరిన యాక్టివ్ కేసులు, 8 లక్షలు దాటిన మొత్తం పాజిటివ్ కేసులు, గత 24 గంటల్లో 3,765 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ, 6,544కు చేరిన మృతుల సంఖ్య

ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీ ఆర్టీసీ బస్సులు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద బస్సులు అందుబాటులో ఉంచామని మంత్రి పేర్ని నాని తెలిపారు. పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టల వద్ద ఏపీ బస్సులు ఉంటాయని చెప్పారు. సరిహద్దుల నుంచి ఊళ్లకు చేరేందుకు బస్సులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జూన్‌ 18 నుంచి టీఎస్‌ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నామని చెప్పారు. తెలంగాణ-ఏపీ మధ్య బస్సులు నడిపేందుకు కృషి చేశామని తెలిపారు.

టీఎస్ ఆర్టీసీ కార్యాలయానికి సెలవులు కావడంతో నిర్ణయంలో జాప్యం అయిందని అన్నారు. టీఎస్ ఆర్టీసీతో పూర్తి స్థాయి చర్చలు అనంతరం బస్సులు నడుపుతాంమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ లాభనష్టాలు చూడట్లేదు, ప్రజలు ఇబ్బంది పడకూడదనే తమ ఉద్దేశమని తెలిపారు.